Friday, November 22, 2024

కోవిడ్‌ కట్టడికి నిర్విరామ సేవలు..


వికారాబాద్‌..ప్రభన్యూస్‌ ప్రతినిధి : కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి సరికొత్త పుంతలు తొక్కుతోంది. పట్టణాలను..గ్రామాలను కోవిడ్‌ చుట్టేస్తోంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారి వద్దకు వెళ్లడానికి ప్రజలు..కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. కోవిడ్‌తో చనిపోయిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి పరిస్థితులలో వైద్య సిబ్బంది అందజేస్తున్న సేవలు అసమానం..సాహసోపేతంగా ఉంటున్నాయి. కోవిడ్‌ యోధులుగా గుర్తింపు పొందిన వైద్యులు..వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి మరీ కోవిడ్‌ కట్టడిలో పాలుపంచుకుంటున్నారు. అలుపెరుగని కోవిడ్‌ యోధులపై కథనం.

కరోనా మహ్మామారి కట్టడిలో వైద్య లోకం అందిస్తున్న సేవలను ఎంత పొగిడినా తక్కువే. కరోనా రెండో దశ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉంది. ఆసుపత్రులకు బాధితులు పోటెత్తుతున్నారు. పరీక్షలకు ప్రజలు క్యూ కడుతున్నారు. టీకాల కొరకు పరుగులు తీస్తున్నారు. వీరందరికి వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు అమోఘం..అనిర్వచనీయం. గత ఏడాది కాలంగా వైద్య విభాగం అధికారులు..సిబ్బంది అంతా కూడా కోవిడ్‌ కట్టడిలోనే తలమునకలై ఉన్నారు. కోవిడ్‌ వ్యాప్తి తగ్గింది అని ఊపిరిపీల్చుకుంటున్న సమయంలోనే మరోసారి జన్యుమార్పిడి చెందిన వైరస్‌ ప్రజలపై దాడి చేసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు కోవిడ్‌ వైరస్‌ బారిన పడుతున్నారు.

జిల్లాలో ప్రతిరోజు 2 వేల వరకు కోవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి పెరగడంతో పరీక్షల సంఖ్యను పెంచారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు..ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతిరోజు పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణలో వైద్య సిబ్బంది అత్యంత చురుగ్గా పాల్గొంటున్నారు. వైరస్‌ బారిన పడిన వారితో..లక్షణాలు లేని వారితో ఆప్యాయంగా మాట్లాడి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల సంఖ్యను పెంచి కోవిడ్‌ కట్టడికి వైద్య సిబ్బంది చేస్తున్న కృషి నిజంగా అద్భుతమే. ఇక కోవిడ్‌ బాధితులపై ప్రతిరోజు నిఘా ఉంచి వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ వారికి సాంత్వన చేకూరుస్తున్నారు. మరోవైపు కోవిడ్‌ బారిన పడి ప్రభుత్వ ఆసోలేషన్‌ కేంద్రాలలో ఉంటున్న బాధితులకు వైద్యులు..సిబ్బంది అందిస్తున్న సేవలు నిరుపమానం. వైద్యులు..సిబ్బంది నిత్యం బాధితులతో కూడిన వార్డులలో అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ విభాగంలో పనిచేస్తున్న వైద్యులు..సిబ్బంది చాలా వరకు తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. బాధితుల నుంచి తమకు వైరస్‌ వ్యాపించకుండా వైద్య సిబ్బంది అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలోని వికారాబాద్‌..తాండూరులలో కోవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో పదుల సంఖ్యలో కోవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఇక కోవిడ్‌ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో కూడా వైద్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. టీకాలు వేయించుకునేందుకు వస్తున్న వారి వివరాలను నమోదు చేసుకొని టీకాలు వేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో టీకాల పంపిణీ కొనసాగుతోంది. ఈ కేంద్రాలలో వైద్య సిబ్బంది అత్యంత జాగ్రత్తతో పనిచేస్తున్నారు. కోవిడ్‌ను సమర్థవంతంగా కట్టడి చేయడంలో టీకా పంపిణీ కేంద్రాల సిబ్బంది విశేష సేవలను అందిస్తున్నారు. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రజలకు టీకాలను విజయవంతంగా పంపిణీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు..సిబ్బంది గొప్పగా సేవలు అందిస్తున్నారు. కోవిడ్‌ కట్టడిలో భాగం పంచుకుంటున్న వైద్యులు..సిబ్బంది తమతో పాటు కుటుంబ సభ్యులు ఎవరు కూడా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ప్రతిరోజు వివిధ రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు చాలా వరకు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు.

కుటుంబ సభ్యులకు దూరం: జయప్రసాద్‌, ప్రభుత్వ వైద్యులు
——————————————————————
అన్నింటిని త్యాగం చేసి ప్రభుత్వ వైద్యులు..సిబ్బంది కోవిడ్‌ కట్టడిలో పాలుపంచుకుంటున్నారు. నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటున్నాం. బంధువుల వద్దకు వెళ్లక నెలల గడుస్తోంది. ఇంటికి ఎవరూ రావడం లేదు. తమతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం నిత్యం ప్రమాదంలో ఉంటోంది. అయినా వైద్య సిబ్బంది అన్నింటిని త్యాగం చేసి కోవిడ్‌ కట్టడిలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత మాపై ఉంది. వైద్యులు..వైద్య సిబ్బంది అన్ని త్యాగాలకు సిద్దపడి కోవిడ్‌ పోరులో నిమగ్నమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement