Saturday, November 23, 2024

పత్తి..కందికి ప్రాధాన్యం..

వికారాబాద్‌ : వచ్చే ఖరీఫ్‌(వానాకాలం) సీజన్‌లో పత్తి..కంది పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ మార్కెట్‌లో ఈ రెండు పంటలకు అధిక డిమాండ్‌ ఉందని కావున వాటిని సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు..సూచనలతో వ్యవసాయ శాఖ ఈ రెంటు పంటల సాగు విస్తీర్ణంను పెంచేందుకు ప్రణాళిక సిద్దం చేస్తోంది. జిల్లాలో క్రితంసారి కూడా ఈ రెండు పంటల సాగును పెంచడానికి వ్యవసాయ శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

జిల్లాలో ఖరీఫ్‌(వానాకాలం)లో పెద్ద ఎత్తున పంటల సాగు జరుగుతుంది. ఈ సీజన్‌లో జిల్లాలో దాదాపు 5.70 లక్షల ఎకరాలలో రైతులు వివిధ పంటలను సాగు చేస్తారు. ఇందులో ప్రధానంగా పత్తి, కంది, మొక్కజొన్న, వరి పంటలు ఉన్నాయి. క్రితంసారి ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో పత్తి..కంది పంటల సాగు విస్తీర్ణంను పెంచడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం అమలు చేసిన నియంత్రిత పంటల సాగు విధానంలో భాగంగా జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. క్రితంసారి ఖరీఫ్‌లో జిల్లాలో రైతులు దాదాపు 2.70 లక్షల ఎకరాలలో పత్త పంటను సాగు చేయగా 1.82 లక్షల ఎకరాలలో కంది పంటను సాగు చేశారు. ప్రభుత్వం వచ్చే ఖరీఫ్‌లో ఈ రెండు పంటల సాగు విస్తీర్ణంను మరింతగా పెంచాలని నిర్ణయించింది.

వచ్చే ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల ఎకరాలలో పత్తి, 20 లక్షల ఎకరాలలో కంది పంటలను సాగు చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఆయా జిల్లాలలో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా ఈ రెండు పంటల సాగు విస్తీర్ణంను పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో పత్తి..కంది పంటల సాగుకు అనువైన వాతావరణం ఉంది. దీంతో సాధ్యమైనంత ఎక్కువగా పత్తి..కంది పంటల సాగును పెంచాలని యోచిస్తున్నారు. జిల్లాలో పత్తి పంటను 3 లక్షల ఎకరాలు..కంది పంటను 2 లక్షల ఎకరాలకు పెంచేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది.

మరోవైపు రైతులు ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో పత్తి..కంది పంటను సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. క్రితంసారి ప్రభుత్వ సూచనల మేరకు ఈ రెండు పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ఈసారి కూడా ప్రభుత్వ సూచనల మేరకు పత్తి.. కంది పంటల సాగును చేస్తామని.. అయితే ప్రభుత్వం వాటికి ప్రత్యేకంగా బోనస్‌ ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. పంటల సేకరణ సమయంలో మద్దతు ధరలతో పాటు ప్రత్యేక బోనస్‌ ఇవ్వాలని రైతులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బోనస్‌ ప్రకటిస్తే పత్తి..కంది పంటల సాగు మరింత పెరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement