వికారాబాద్ : కరోనా నిర్థారణ అయితే ఆసుపత్రిలో చేరాలి..అక్కడి వైద్యులు వేసే బిల్లుల మోతను భరించాలి..అప్పులు చేయాలి లేదంటే ఆస్తులను అమ్ముకోవాలి అనే భయం ఇప్పటి వరకు బాధితులను వెంటాడింది. ఇలా పెద్ద సంఖ్యలో బాధితులు ప్రైవేటు ఆసుపత్రిలో చేరి లక్షలు పోగొట్టుకున్నారు. బాధితులలో ఉన్న భయంను ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకున్నాయి. హైదరాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రులు అచ్చంగా ఇదే దందాను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా వైద్యం మారిపోయింది. కరోనా వైరస్ సోకిన వారంతా ఇళ్లలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇంటి వద్దకే మందులు..వైద్య సిబ్బంది వస్తున్నారు. దీంతో బాధితులు పైసా ఖర్చు లేకుండా కరోనాను జయిస్తున్నారు.
జిల్లాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వైరస్ గ్రామాలకు పాకింది. ఒక్కో గ్రామంలో పది నుంచి పాతిక మంది వరకు వైరస్ బారిన పడుతున్నారు. గ్రామీణ మండలాల్లో కూడా వందల సంఖ్యలో కేసులు ఉన్నాయి. పొరుగున ఉన్న కర్ణాటకలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. వివిధ పనుల మీద అక్కడికి వెళ్లి వచ్చిన వారు.. లేదంటే అక్కడి నుంచి వచ్చిన వ్యక్తులతో కలిసి తిరిగిన వ్యక్తులు కరోనా బారిన పడుతున్నారు. ఈ కారణంగా జిల్లాలోని గ్రామాలలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతిరోజు కరోనా కేసులలో జిల్లా సరికొత్త రికార్డులను నమోదు చేసుకుంటోంది.
ఇప్పటి వరకు జిల్లాలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 5747కు చేరుకుంది. జిల్లాలో 262 మందికి వైరస్ సోకింది. జిల్లాలోని తాండూరు, బొంరాస్‌పేట్ మండలాల్లో అత్యధిక కేసులు నమోదు కావడం గమనార్హం. జిల్లాలో వైరస్ సోకిన 262 మందిలో ఒక్కరు కూడా ఆసుపత్రిలో చేరకపోవడం గమనార్హం. వీరంతా కూడా హోం ఐసోలేషన్(గృహ నిర్బంధం)లో ఉన్నారు. జిల్లాలో మొత్తం 1761 మంది వైరస్ బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కేవలం 16 మంది మాత్రమే ఆసుపత్రిలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. 99 శాతం వైరస్ బాధితులు ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో కేసుల సంఖ్య భారీగా ఉంది. స్థానికంగానే కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో గ్రామాలలోనే వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. కోవిడ్ పాజిటివ్‌గా గుర్తించిన బాధితులను గ్రామాల్లోనే హోం ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు. కొందరిని పొలాల వద్ద ఉండే ఇళ్లలో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మరికొందరు పొలాల వద్ద తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. మరికొందరు గ్రామానికి సమీపంలో ఉండే అటవీ ప్రాంతాలకు వెళుతున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉంటున్న బాధితుల వద్దకు వైద్యులు వెళ్లి సేవలు అందిస్తున్నారు. బాధితులకు అవసరం అయిన మందులను అందిస్తున్నారు. అవసరం అయిన వారికి వైద్య చికిత్సలు కూడా అందిస్తున్నారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ సిబ్బంది హోం ఐసోలేషన్‌లో ఉంటున్న బాధితుల అవసరాలను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
కరోనా వైరస్ సోకిన బాధితులు గ్రామాలలో ఎలాంటి ఆందోళన చెందడం లేదు. రెండు వారాల పాటు హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొంది తిరిగి ఆరోగ్యవంతులు అవుతున్నారు. దీంతో వైరస్ బారిన పడుతున్న బాధితులు ఎవరు కూడా పెద్దగా ఆందోళన చెందడం లేదు. గతంలో మాదిరిగా కరోనా వైరస్ సోకితే ప్రైవేటు ఆసుపత్రిలో చేరి లక్షలు ఖర్చు చేసుకోవాలనే ఆందోళన లేకపోవడంతో గ్రామాల్లోనే హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. మారిన కరోనా చికిత్స విధానంతో గ్రామీణ బాధితులు పెద్ద ఎత్తున లాభపడుతున్నారు.