తాండూరు : కరోనా మహామ్మారితో రోజు రోజు వణికిపోతున్న ప్రజలకు మరో ఆందోళన వెంటాడుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షలకు కిట్స్ కొరత ఏర్పడడంతో తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, నియోజకవర్గంలోని పలు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సేవలు స్థంభించిపోయాయి. దీంతో పరీక్షల కోసం వచ్చిన ప్రజలు, బాధితులు పడిగాపులు గాసి వెనుదిరిగి వెళ్లిపోయారు. కరోనా విజృంభణతో గత యేడాది నుంచి తాండూరు జిల్లా ఆసుపత్రిలో కరోనా నిర్దారణ పరీక్షలను అందుబాటులోకి తెచ్చారు. గత కొన్ని నెలల క్రితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరీక్షల సేవలను విస్తరించారు. బషీరాబాద్ మండలంలో మండల కేంద్రంతో పాటు నవల్గా ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, యాలాల మండలంలోని ఆరోగ్యకేంద్రం, తాండూరు మండలం జినుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పెద్దేముల్ మండలంలోని ఆరోగ్య కేంద్రాల్లో ప్రతిరోజూ దాదాపు 100 పరీక్షలను నిర్వహిస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో ప్రతి రోజు సుమారుగా 100 నుంచి 150 వరకు పరీక్షలు నిర్వహించే వారు. ర్యాపీడ్ యాంటిజెన్ పరీక్షల ద్వారా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా నిర్దారణ కిట్ల కొరత ఏర్పడింది. పరీక్షల కోసం ప్రజలు రావడంతో మర్పల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నుంచి కిట్లను తెప్పించి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు వచ్చేవారికి ఎలాంటి కిట్లు అందుబాటులో లేకపోవడంతో సేవలను నిలిపివేశారు. దీంతో పాటు యాలాల, తాండూరు మండలం జినుగుర్తి ఆరోగ్యకేంద్రాలలో కూడ కిట్లు లేక పరీక్షలను నిలిపివేశారు. కరోనా లక్షణాలు ఉన్న వారితో పాటు భ యాందోళనలో ఉన్న ప్రజలు పరీక్షలను నిర్వహించుకునేందుకు ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివ చ్చారు. తీరా కిట్లు లేక సేవలను నిలిపివేశామని అధికారులు చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. ప్రాణాల మీదకు వస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో కిట్లు అందుబాటులో ఉంచకపోవడం ఏంటని వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. పడిగాపులు కాస్తున్నామని, కిట్లు లేక పరీక్షలు నిర్వహించకపోతే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచే ఉత్పత్తి రాలేదని, వచ్చిన వెంటనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడంతో పరీక్షలకు వచ్చిన వారంతా వెనుదిరిగి వెళ్లిపోయారు. మరో రెండు రోజుల వరకు కిట్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో తాండూరు ప్రజలు అంతా భయాందోళనకు గువుతున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం జిల్లా ఆసుపత్రిలో అత్యవసర కేసులకు బయట నుంచి కిట్లను తెప్పించి పరీ క్షలు నిర్వహించిన అనంతరం వైద్య సేవలను అందించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement