రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి (ప్రభ న్యూస్) : రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని రాష్ట్ర సమాచార ప్రచార శాఖ, భూగర్భ గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం శంకర్ పల్లిలో పదిహేను వందల పన్నెండు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయంను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ పదివేల కోట్ల రూపాయలతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఆయన అన్నారు. పేదరిక నిర్మూలన సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని ఆయన పేర్కొన్నారు.
తొలి విడతలో 11,700 అందివ్వగా, 2వ విడతలో 13,200 ఇళ్లను, నేడు 3 విడతగా 19,020 ఇళ్ల పంపిణీతో ఇప్పటి వరకు 34,920 ఇళ్ల ను పంపిణీ చేస్తున్నామని మహేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 5న 4వ విడత 17,864 మందికి ఇళ్ల పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసి పరిసర రంగారెడ్డి జిల్లా పరిధిలో 23,260 ఇళ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నంలో 9,872, మహేశ్వరం నియోజకవర్గంలో 9,892, రాజేంద్రనగర్ లో 696, ఎల్బీనగర్ లో 944, చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లిలో 1,512, శేర్లింగంపల్లిలో 344 ఇళ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరంలోని పాత నగరాన్ని అభివృద్ధి పరిచేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ… నిరుపేదలు కూడా మహానగరంలోని గేటెడ్ కమ్యూనిటీలో నివాసముండే స్థాయిలో నివాసం ఉండే విధంగా ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఘనత కేసీఆర్ కే దక్కిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, జిహెచ్ఎంసి జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయ లక్ష్మి ప్రవీణ్ కుమార్, ఆర్డీఓ సాయిరాం, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జెడ్పిటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.