వికారాబాద్ :జిల్లాలోని వికారాబాద్..తాండూరు బస్సు డిపోల అధికారులు వినూత్నంగా చేసిన ఆలోచన అందరిని ఆకట్టుకుంటోంది. ఆయా డిపోలలో పాడైన బస్సులను బస్ షెల్టర్‌లుగా వినియోగించుకుంటున్నారు. ఈ ఆలోచనకు సంస్థ ఉన్నతాధికారులు అభినందించడంతో పాటు ప్రయాణికుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. డిపో మేనేజర్ల వినూత్న ఆలోచనతో ఎర్రటి ఎండలో బస్సుల కొరకు వేచిచూస్తున్న ప్రయాణికులకు ఉపశమనం లభిస్తోంది.
మహారాష్ట్రలోని సూరత్ మహానగరంలో మూలకు చేరిన ఆర్టీసీ బస్సులకు గులాబి రంగు వేసి చూడముచ్చటగా తీర్చిదిద్ది మహిళా శౌచాలయాలుగా మార్చారు. వాటిని నగరంలోని పలు ప్రాంతాలలో ఉంచి సేవలు అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు వీటిని వినియోగిస్తున్నారు. అక్కడి అధికారులు చేసిన ఈ ఆలోచనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. ఈ ఆలోచనతో స్ఫూర్తి పొందిన ఇక్కడి ఆర్టీసీ అధికారులు కూడా విభిన్నంగా ముందుకు సాగారు. ప్రతి డిపోలో పెద్ద సంఖ్యలో పాడైన బస్సులు ఉన్నాయి. కాలం తీరిన ఈ బస్సులు చాలా కాలంగా డిపోలకు పరిమితం అవుతున్నాయి. ఈ బస్సులను ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై ఆర్టీసీ యాజమాన్యం చాలా కాలంగా ఆలోచన చేస్తోంది.
జిల్లాలో మొదటగా తాండూరు డిపో మేనేజర్ రాజశేఖర్ డిపోకు పరిమితం అయిన బస్సులను పట్టణ ప్రాంతంలోని వివిధ కూడళ్లలో బస్‌షెల్టర్‌గా వినియోగించడం ప్రారంభించారు. తాండూరులో గత వారం క్రితం చేసిన ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చింది. తాండూరు పట్టణంలోని ఇందిరాచౌక్ కూడలిలో పాడైన ఆర్టీసీ బస్సును రోడ్డు పక్కన ఉంచి బస్‌షెల్టర్‌గా వినియోగిస్తున్నారు. ఇలాంటి ప్రయోగంను వికారాబాద్ డిపో మేనేజర్ కూడా చేపట్టారు. వికారాబాద్ పట్టణంలోని ఎన్‌టిఆర్ కూడలిలో కాలంతీరిన ఆర్టీసీ బస్సును నిలిచి బస్‌షెల్టర్‌గా వినియోగిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాలలో బస్సుల కొరకు నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఎదురుచూస్తుంటారు. ఆర్టీసీ అధికారులు చేసిన ఆలోచనకు మంచి స్పందన కనిపిస్తోంది. బస్‌షెల్టర్‌గా మారిన బస్సులలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వేచి ఉంటున్నారు. ఈ బస్సులలో ఒక ఆర్టీసీ అధికారి కూడా ఉంటున్నారు. బస్సులు వచ్చే సమాచారంను వేచి ఉన్న ప్రయాణికులకు అందజేస్తున్నారు. బస్‌షెల్టర్‌గా మారిన బస్సులలో కూర్చునేందుకు మంచి సీట్లు..తాగేందుకు చల్లటి శుద్ధి చేసిన(మినరల్) నీటిని కూడా అందిస్తున్నారు.
ఆర్టీసీ అధికారులు చేసిన ఈ ప్రయోగం జిల్లాలో విజయవంతం అయ్యింది. పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో నిలిపి ఉంటున్న తాత్కాలిక బస్‌షెల్టర్లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు సేదతీరుతున్నారు. ప్రయాణికులు సైతం ఆర్టీసీ అధికారుల చర్యలను అభినందిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తాత్కాలిక బస్‌షెల్టర్‌గా మారిన ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు. అనంతరం వాటిని డిపోకు తరలిస్తున్నారు. తిరిగి మరుసటి రోజు ఉదయం వాటిని అదే ప్రాంతానికి తరలించి బస్‌షెల్టర్‌గా వినియోగిస్తున్నారు.
మంచి స్పందన కనిపిస్తోంది: రాజశేఖర్, డిపో మేనేజర్(తాండూరు)
డిపోకు పరిమితం అయిన బస్సులను తాత్కాలిక బస్‌షెల్టర్‌గా మార్చి వినియోగిస్తున్నాం. మొదటగా ఒక బస్సును ఎంపిక చేసిన కూడలిలో బస్‌షెల్టర్‌గా వినియోగిస్తున్నాం. తాత్కాలిక బస్ షెల్టర్లకు మంచి స్పందన కనిపిస్తోంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వాటిలో బస్సుల కొరకు సేద తీరుతున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి ప్రయాణికులను రక్షించేందుకు చేపట్టిన ఈ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి.