మేడ్చల్ (ప్రభన్యూస్): మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని అద్వెళ్లి మున్సిపల్ పట్టణ మూడో వార్డులో అంతర్గత మురుగు కాలువలను నిర్మించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి జాకట ప్రేమ్ దాస్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలోని మూడో వార్డులోని ఇందిరమ్మ కాలనీ వద్ద అంతర్గత మురుగు కాలువ లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై ఏరులై పారుతోందన్నారు. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మూడో ఈ విషయాన్ని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు తెలియజేసినా నామమాత్రంగా రిపేరు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని ప్రేమ్ దాస్ అన్నారు.
అంతే కాకుండా పక్కనే ఉన్న పేదలకు ఈ సమస్య చాలా రోజుల నుండి ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ మున్సిపల్ కౌన్సిలర్, అధికారులు పట్టించుకోకపోవడం లేదని ప్రేమ్ దాస్ ఆరోపించారు. దీంతో ఓపెన్ ప్లాట్ లలో నిలువ ఉన్న మురుగు నీటితో దోమలు, ఈగలు పెరిగిపోతున్నాయని, అంటువ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.