రూ.70ల కోసం ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి పట్టణంలో ఆటో డ్రైవర్, ప్రయాణికుడికి జరిగిన చిన్న గొడవ.. చివరికి ఆత్మహత్యాయత్నం వరకు తీసుకెళ్లింది. 100 రూపాయలకు బేరం మాట్లాడుకొని ఆటో ఎక్కిన ఆ ప్రయాణికుడు.. తన గమ్యం చేరగానే 30 రూపాయలే ఇచ్చాడు. దీంతో షాక్కు గురైన ఆటో డ్రైవర్ వెంకటస్వామి.. ఆటో చార్జ్ 100 రూపాయలు అయిందని.. మొత్తం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు.
ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఆ ప్రయాణికుడు.. పోలీసులకు ఫోన్ చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంకటస్వామిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన ఆటో డ్రైవర్.. స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే మంటలను అదపు చేశారు. 60 శాతం కాలిన గాయాలతో వెంకటస్వామిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే వెంకటస్వామి ఆత్మహత్యకు ప్రయత్నించాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల ముందే పెట్రోల్ పోసుకుంటుంటే.. ఎందుకు ఆపలేదని ప్రశ్నిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital