కొందుర్గు, (ప్రభ న్యూస్) : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు ఉధృతంగా పారుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఆగిర్యాల వాగు, కొందుర్గు గంగన్నగూడెం గ్రామాల మధ్య వాగు, తంగేళ్ళ పల్లి విశ్వనాథ్ పూర్ గ్రామాల మధ్య వాగుల్లో వర్షపు నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. వాగుల్లో నీటి నిలువలు పెరగకుండా, చెట్టు కొమ్మలను.. కంప రెబ్బలను తొలగించేలా సర్పంచ్ శ్రీధర్ రెడ్డి సహాయక చర్యలు చేపట్టారు.
ఇక.. కొందుర్గు మండల పరిధిలోని చెరుకుపల్లి పంచాయతీలోని జాకారం పెంటమ్మ అనే మహిళకు చెందిన రేకుల ఇల్లు వర్షానికి గోడలు తడిచి కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. దీంతో ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పేద మహిళలకు ఆర్థిక సాయం చేయాలని గ్రామస్తులు కోరారు.