Tuesday, November 19, 2024

18 దాటినవారందరికి వ్యాక్సిన్‌..

తాండూరు : వచ్చే నెల మే మొదటి వారం నుంచి 18 నిండిన వారికి వ్యాక్సీనేషన్‌ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని వికారాబాద్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య అన్నారు. ఆయన తాండూరులోని జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి సూపరిండెంట్‌ డా.మల్లికార్జున్‌ స్వామితో కలిసి ఆసుపత్రిలో పలు విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉండే ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు కొవిడ్‌ రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం పీపీ యూనిట్‌లో నిర్వహిస్తున్న వ్యాక్సిన్‌ సెంటర్‌ను సందర్శించారు. అదేవిధంగా జిల్లా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న కొవిడ్‌ నిర్దారణ సెంటర్‌ను ఇతర చోటుకు మార్చేందుకు ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఇందుకోసం జూనియర్‌ కళాశాలలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య మాట్లాడుతూ వచ్చే నెల మే మొదటి వారం నుంచి 18ఏండ్లు దాటిన వారందరికి వ్యాక్సినేషన్‌ పంపిణీ కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. వ్యాక్సినేషన్‌ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఎదరవకూడదనే ఉద్దేశంతోనే జిల్లా ఆసుపత్రిలోని వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను హైదరాబాద్‌ రోడ్డు మార్గంలోని మాతాశిశు ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. వ్యాక్సినేషన్‌ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దృష్టిసారిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజలంతా కరోనా సెకండ్‌ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా మెలగాలన్నారు. మాస్కులు, శానిటైజర్‌ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. వారి వెంట ప్రత్యేకాధికారి హన్మంతరావు, వైద్య సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement