హైదరాబాద్ నగర ట్రాఫిక్ జాయింట్ సీపీగా రంగనాథ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేసిన రంగనాథ్.. ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ ఇబ్బందులపై గతంలో డీసీపీగా పనిచేసిన అనుభవం ఉందని అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగే ప్రయత్నం చేస్తానని తెలిపారు.
డిసెంబరు 31న ట్రాఫిక్ ఆంక్షలపై మార్గదర్శకాలు విడుదల చేస్తానని చెప్పారు. వేగంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మరింత విస్తృతం చేస్తామని రంగనాథ్ తెలిపారు. స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లతో పాటు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే వాణిజ్య సముదాయాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.