హైదరాబాద్, ఆంధ్రప్రభ: శవాలపైనా పైసలు ఏరుకుతినే రాబంధుల్లా ఉస్మానియా సిబ్బంది మారిపోయారు. శవాల ద్వారా కూడా అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. కుటుంభీకులు చనిపోయారన్న పుట్టెడు దుంఖంలో ఉన్న బాధితుల నుంచీ నిర్ధాక్షిణ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. డెడ్‌బాడీకి పోస్టుమార్టం చేయాలన్నా, శవాన్ని ఫ్రీజర్‌లో ఉంచాలన్నా సిబ్బంది చేతిలో డబ్బులు పెట్టాల్సిందే. లేనిపక్షంలో శవం గంటలతరబడి మార్చురీ ఎదుటే ఉండిపోతోంది. డబ్బులు ఇస్తేనేగాని మార్చురీ నుంచి శవాన్ని బంధువులకు అప్పగించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఈ తరహా దందా ఎప్పటినుంచో కొనసాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అనాథ శవాలను, బంధువులు మార్చురీలోనే వదిలేసిన శవాలను కూడా సిబ్బంది అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ అక్రమాలను ఉస్మానియా ఆసుపత్రి ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలను నిజం చేస్తూ సోమవారం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో దారుణం చోటు చేసుకుంది. వెయ్యి రూపాయిలు ఇస్తే శవాన్ని ఇస్తామని సిబ్బంది సంబంధిత కుటుంబీలకు తేల్చి చెప్పారు. డబ్బులు ఇచ్చేందుకు వెనుకాముందు ఆడిన బంధువులతో వాగ్వాదానికి దిగారు. కలుగజేసుకున్న పోలీసులను సైతం లెక్కచేయకపోవడం గమనార్హం. మార్చురీలోకి డెడ్‌బాడీని తీసుకెళ్లేందుకు కూడా లంచాన్ని డిమాండ్ చేస్తున్నారు.
పాతబస్తీ చాదర్‌ఘట్‌కు చెందిన మహ్మద్ మజీద్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉరివేసుకుని చనిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం త్వరగా చేయాలని కోరగా రూ.1000 ఇస్తేనే చేస్తామని మార్చురీ సిబ్బంది తెగేసి చెప్పారు. మద్యం మత్తులో ఉన్న మార్చురీ సిబ్బంది పోలీసులు, బంధువులతో వాగ్వాదానికి దిగారు. మృతదేహాన్ని అయినా అప్పగించాలని బంధువులు ఎంత కోరినా సిబ్బంది కనికరించలేదు. దీంతో గంటలపాటు మార్చురీ ముందే శవంతో మృతుడి బంధువులు, పోలీసులు వేచి చూడాల్సి వచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..