భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో సీతారాముల కళ్యాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆ నీలిమేఘశ్యాముడు పెళ్లి కొడుకును చేశారు.. దీంతో సీతారాముల కల్యాణ్ పనులకు అంకురార్పణ జరిగింది. ఇక కళ్యాణ పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో డోలోత్సవం, అనంతరం వసంతోత్సవం నిర్వహించారు.
ముత్తైదువులు ఈరోజు పసుపు కొట్టి పనులు ప్రారంభించి కళ్యాణ తలంబ్రాలు తయారు చేస్తే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..ఇక జగదేక రాముడి కల్యాణ్ . ఏప్రిల్ 17న సీతమ్మతో జరగనుంది.. . మిథిలా స్టేడియంలో అభిజిత్ లగ్నాన సీతారాముల కల్యాణం అంగరంగ వైభంగా సాగనుంది. భక్త శ్రీరామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించుకుని రామయ్య పెండ్లికొడుకుగా, సీతమ్మ పెండ్లికుమార్తెగా ఆ పెళ్లి వేడుక రోజు దర్శనమిస్తారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు.
ఆన్ లైన్ లో కల్యాణ టిక్కెట్లు..
కల్యాణం సెక్టార్ టికెట్లు ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చారు.. శ్రీరామనవమి రోజు ఉభయ దాతల టికెట్ రుసుము రూ.7,500 కాగా దీనిపై ఇద్దరికి ప్రవేశం ఉంటుందని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లపై ఒక్కరికి ప్రవేశం కల్పించనున్నట్లు చెప్పారు. 18వ తేదీన పట్టాభిషేక మహోత్సవం సెక్టార్ టికెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.100గా నిర్ణయించినట్లు వెల్లడించారు. వీటిని https:-//bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చని పేర్కొన్నారు.
మరోవైపు కల్యాణం రోజున ప్రత్యక్షంగా రాలేని భక్తులు పరోక్ష పద్ధతిలో తమ గోత్రనామాలతో పూజ చేయించుకునే వెసులుబాటునూ కల్పించారు. దీనికోసం రూ.5 వేలు, రూ.1116 టికెట్లనూ ఇదే వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా సెక్టార్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఏప్రిల్ 1 నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు రామాలయ కార్యాలయం (తానీషా కల్యాణ మండపం)లో తమ ఒరిజినల్ ఐడీ కార్డులను చూపించి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని ఈవో వెల్లడించారు.