రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందు కోసం భూ సేకరణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2, 911 కోట్ల రూపాయలుగా ఉంది.
ప్రస్తుతం బొగ్గును కాజీపేట మీదుగా ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారు. ఈ కొత్త లైన్ నిర్మాణంతో దూరంతో పాటు బొగ్గు రవాణా వ్యయం కూడా తగ్గబోతుంది. పెద్దపల్లి–మణుగూరు రైల్వే లైన్ 207 కిలో మీటర్ల పరిధిలో సింగరేణి కోల్ బెల్ట్లను కలుపుతూ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు.
కాగా, ఇప్పటికే నాలుగు జిల్లాల్లో ప్రధాన రైల్వే స్టేషన్లను కూడా గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ లైన్ నిర్మాణం పూర్తైతే ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను సందర్శించడం కూడా సులువవుతుంది. ప్రస్తుతం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ప్రయాణికులు భద్రాద్రి కొత్తగూడెం వెళ్లాలంటే కాజీపేట మీదుగా తిరిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పాడింది. కొత్త రైల్వే లైన్ పూర్తైతే పెద్దపల్లి నుంచి నేరుగా ములుగు, భూపాలపల్లి మీదుగా కొత్తగూడెం వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో వందల కిలో మీటర్ల దూరం తగ్గిపోతుంది. దీంతో పాటు ఈ జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి కూడా చెందుతుంది.