Friday, November 22, 2024

National : ఘనంగా రంజాన్ వేడుకలు..

“శరీరాన్ని కాదు పాపాన్ని శుష్కింపజేసుకోవాలి.. ఆహారాన్నే కాదు అపసవ్య ధోరణులనూ ఆపేయాలి.. మనసును చెడు ఆలోచనలకు దూరంగా ఉంచాలి.. అదే ఉపవాసం.. అలాంటి ప్రార్థనే దైవ సమ్మతం..” ఇదే రంజాన్‌ ఇచ్చే సందేశం…

- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాల్లో ఈద్-ఉల్-ఫితర్‌ను మతపరమైన ఉత్సాహంతో వైభవంగా జరుపుకున్నారు. దీంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లవిరుస్తోంది. ముస్లింలు ఈద్గాలు, మసీదుల వద్ద ఈద్ ప్రార్థనలు నిర్వహించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఇస్లామిక్ పవిత్ర మాసమైన రంజాన్ ముగింపు సందర్భంగా ఈ పండగను జరుపుకుంటారు. ఈ రంజాన్ నెలలో ముస్లింలు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు నీరు సైతం తీసుకోకుండా కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. ఈ నెల చివరి రోెజైన ఈద్-ఉల్-ఫితర్ ను ఈ నెల రోజులు ఉప‌వాస దీక్ష‌ను విర‌మిస్తారు..

హైద‌రాబాద్ తో…
హైదరాబాద్‌లో ఎప్పటిలానే ఈసారి కూడా రంజాన్ పండగను ఘనంగా జరుపుకున్నారు ముస్లింలు. పాతబస్తీతో పాటు మాసబ్ ట్యాంక్, మిలటరీ గ్రౌండ్స్, మెహదీపట్నం, గోల్కొండ, సికింద్రాబాద్, సంతోష్ నగర్, మదనపేట, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో పండగ శోభ కనిపించింది. చారిత్రాత్మక మీర్ ఆలం ఈద్గా, ఇతర ఈద్గాల వద్ద జరిగిన ప్రార్థనాల్లో జనాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మ‌సీదులు ఉన్న ప్రాంతాల‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించి ప్ర‌శాంతంగా ప్రార్ధ‌న‌లు చేసేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు..

షబ్బీర్ అలీ ఇంట్లో …సీఎం రేవంత్ రెడ్డి
ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్. గురువారం జ‌రిగిన వేడుక‌ల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లారు. ఆయనతో పాటు సికింద్రాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఉన్నారు. ఈ సందర్భంగా దానంకు షబ్బీర్ అలీ, ఆయన కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. షబ్బీర్ అలీకి, అక్కడున్న ఇతర ముస్లిం పెద్దలకు రేవంత్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరితో కలిసి విందు ఆరగించారు. మరోవైపు రంజాన్ సందర్భంగా ముస్లింలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్షించారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే ఈ రంజాన్ పండుగను ముస్లింలందరూ తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని అన్నారు.

మంత్రి కొండా సురేఖ ప్రత్యేక ప్రార్థనలు

రంజాన్ పండుగ సందర్భంగా వరంగల్‌లోని జెమినీ థియేటర్ వద్ద ఉన్న ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి మంత్రి కొండ సురేఖ, హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, సిరిసిల్ల రాజయ్యలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులందరీకి హృదయపూర్వక రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కొండా సురేఖ. ఎన్నికల కోడ్ రావడం వల్ల ప్రభుత్వం తరఫున సదుపాయాలు ఏమి చేయలేకపోయామన్నారు. 40 రోజులు ఎంతో నిష్టతో చిన్న నుండి పెద్ద వరకు అందరు ఉపవాసం చేయడం చాలా విశేషమని ఆమె తెలిపారు. మతాలకు, కులాలకు అతీతంగా రంజాన్ పండుగను జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు ఒక ప్రత్యేక హోదాలో ఈద్గాకి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అల్లాను స్మరించుకునే అవకాశం రావడం చాలా సంతోషమన్నారు. రంజాన్ పండుగ మన బ్రతుకులలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.

స్వీట్లు పంచిన సీతక్క

మరో వైపు ములుగు జిల్లా కేంద్రంలో రంజాన్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రి సీతక్క రంజాన్ వేడుకలకు హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు స్వీట్లు పంచుతూ, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. రంజాన్ మాసం సందర్భంగా చేపట్టే ఉపవాస దీక్షలు, ఖురాన్ పఠనం, పేదవారికి దానం వంటి కార్యక్రమాలు స్వీయ క్రమశిక్షణను, జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయని మంత్రి అన్నారు. మానవీయ విలువలను రంజాన్ పండుగ పెంపొందిస్తుందని మంత్రి వెల్లడించారు.

సానియా ఇంట రంజాన్ వేడుకలు ..

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుక‌ల‌లో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సానియా మీర్జాతో దిగిన లేటేస్ట్ ఫొటోలను ఇన్ స్టా వేదికగా స్మితా సబర్వాల్ పంచుకున్నారు. ఈ పోస్ట్‌కు సానియా మీర్జాతో దిగిన ఫొటోలను షేర్ చేసిన స్మితా సబర్వాల్ ఈద్ ముబారక్ అంటూ విషెస్ తెలిపారు.

ఢిల్లీలో…

దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలు ఘనంగా నిర్వ‌హించారు. ముస్లింలు వివిధ మసీదులలో నమాజ్ చేశారు. ఢిల్లీలోని జామా మసీదుకు ముస్లింలు నమాజ్ చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫతేపూర్‌ మసీదు షాహీ ఇమామ్ మౌలానా ముఫ్తీ ముకర్రమ్ అహ్మద్.. ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశానికి శాంతి, సామరస్యం సమకూరేందుకు ప్రార్థనలు చేయాలని ప్రజలను కోరారు. రంజాన్ వేళ ఫోన్, వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

మార్కెట్లు కిట‌కిట

ముస్లింలు ఈద్ కోసం పెర్ఫ్యూమ్, క్యాప్స్, డ్రై ఫ్రూట్స్ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. పాత ఢిల్లీతో పాటు, జామియా నగర్, సీలంపూర్, జాఫ్రాబాద్, నిజాముద్దీన్ సహా ఇతర మార్కెట్లలో రద్దీ పెరిగింది. రాత్రంతా ఇదే పరిస్థితి కొనసాగింది. ఈద్‌ వేడుకల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement