హైదరాబాద్ – ప్రజా పాలన పథకం అప్లికేషన్ ఫారమ్ ను మీ సేవలో రూ.60 కు విక్రయిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ లోని పలు ప్రజపాలన కేంద్రాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేలాది మంది దరఖాస్తుల కోసం వస్తే కేవలం ఒక్కో సెంటర్ లో వంద మాత్రమే అందుబాటులో పెడుతున్నారని అన్నారు. మీ సేవలో ప్రజా పాలన పథకం అప్లికేషన్ ఫారమ్ ను రూ.60లకు విక్రయిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అప్లికేషన్ ఫార్మ్స్ అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉచిత దరఖాస్తులు కావాలంటే మండల , మునిసిపల్ కార్యాలయాలకు వెళ్లమని చెప్పడం ఏమిటన్నారు.. సెంటర్లలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
అధికారులు తగిన ప్రచారం చేయలేదని మండిపడ్డారు. రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల కోసం ఫార్మ్ లో ఎలాంటి వివరాలు లేవని అన్నారు. రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల కోసం వైట్ పేపర్ పై రాసి ఇవ్వాలని అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తుందని అన్నారు. గోషామహల్ నియోజక వర్గంలో 24 లోకేషన్ లలో ప్లాన్ చేశారని, అక్కడ ప్రజాపాలన ఫామ్ లు పెడుతున్నారని అన్నారు. అయితే 24 లొకేషన్ లో 100, 200 ఫామ్ లు మాత్రమే పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మునిషిపల్ కార్పొరేషన్ వారు సమావేశం పెడితే వారితో ముందుగానే చెప్పామని. ప్రజలకు సమాచారం అందించాలని, పేపర్ యాడ్ ఇవ్వాలని కోరామన్నారు.
ప్రజలకు ఏఏ సెంట్రల్ లకు వెళ్లాలి, ఏ తేదీలో వెళ్లాలని సమాచారం ఇవ్వాలని ముందే చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే ఇది కొనసాగితే ప్రజలకు ఫారమ్ లు పూర్తీగా వివరణ ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని అన్నారు. ప్రజాపాలన అంటే ముందుగానే ప్రజలకు దీనిపై అవగాహన ఇవ్వాలని డిమాండ్ చేశారు.