ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేక దృష్టి
తిరుమల తరహా నిత్యాన్నదానం
శృంగేరి పీఠాధిపతుల సూచనల ప్రకారం విస్తరణ
రవాణా శాఖ మంత్రి పొన్నం
వేములవాడ, ఆంధ్రప్రభ : సుప్రసిద్ధ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ… వేములవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఆలయంపై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక భక్తులు వచ్చే ఆలయమని, ఆలయం మరింత అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యానికి అనుగుణంగా శాస్త్రోక్తంగా వేదపడింతుల, శృంగేరి పీఠాధిపతి సలహా సూచన మేరకు ఆలయ విస్తరణ చేస్తామన్నారు. ఎమ్మెల్యే అది శ్రీనివాస్ తో కలిసి తిరుమలలో ఉన్న నిత్యాన్నదాన కార్యక్రమంలా వేములవాడలో కూడా నిత్యాన్నదాన సత్రం ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. భక్తులు, దాతలు కూడా సహకరించాలని, రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదాన సత్రం ప్రారంభించాలని అనుకుంటున్నామన్నారు.
తిరుమలలో వెంగమాంబ సత్రం మాదిరి వంటకి సంబంధించి అత్యాధునిక సామాగ్రితో సహా అన్ని ఏర్పాట్లు చేసే శక్తిని ఆ భగవంతుడు ప్రసాధించాలన్నారు. తిరుపతిలో అన్నదాన సత్రం ప్రారంభించిన ఎన్టీఆర్ ను జ్ఞాపకం ఉంచుకుంటామన్నారు. నిత్యాన్నదాన సత్రం భవన నిర్మాణం కోసం ప్రభుత్వం పూనుకుందన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు కోడె మొక్కులు చెల్లిస్తారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే భవిష్యత్ లో వేములవాడ గోశాలకి ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారి శ్రీనివాస్ ను పంపించారన్నారు.
వేములవాడలో ఉన్న 2 ఎకరాల స్థలాన్ని టూరిజంకు అప్పగించామన్నారు. తెలంగాణలో రైతాంగం సమృద్ధిగా వర్షాలు కురిసి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ స్వామి వారిని కోరుకున్నామన్నారు. భక్తులు ఇచ్చిన కోడెలు పక్కదారి పట్టకూడదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ అఖిల్ మహాజన్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.