శ్రీ సత్య సాయి బ్యూరో నవంబరు07:( ప్రభన్యూస్) – రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసమే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గత పాలకులు కేవలం వారి వారు ప్రయోజనాల కోసం ఆలోచించి, రైతులు మహిళలు, నిరుపేదల సమస్యలను గాలికి వదిలేసి, పాలన సాగించారని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. మంగళవారం శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రంలోని పుట్టపర్తి రైతు భరోసా కు సంబంధించిన నిధులు విడుదల బటన్ నొక్కే కార్యక్రమం సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు గడచిన నాలుగు సంవత్సరాల కాలంలో రైతుల కోసం లక్షా 75 వేల కోట్లు వ్యయం చేశామన్నారు.కేవలం రైతు భరోసా పథకం కింద వరుసగా ఐదో ఏడాది 53 లక్షల 53 వేలమంది రైతు కుటుంబాలకు 2204 .77కోట్ల రూపాయలు బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందిన్నారు.గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రైతన్నల కోసం చేసిన అభివృద్ధి ఏమిటి అనేది, మీరే ఆలోచించాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.ఇదే సందర్భంలో ఆహార ధాన్యాలు కొనుగోలు విషయంలో కూడా తామే రైతులకు అండగా నిలిచి 166 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు కొనుగోలు చేసి, ఆదుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పాడి రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా లీటరు కు 10నుంచి 22 రూ వరకు పెంచామన్నారు.
రాష్ట్రంలో 70 శాతం వ్యవసాయ రంగంలో ఆధారపడి ఉండగా అందులో 50 శాతం మంది రైతులు అర హెక్టార్ అనగా ఎకరా 25 సెంట్లుభూమి మాత్రమే కలిగి ఉన్నారని. అలాంటి రైతులకు కనీస పెట్టుబడి కింద ఏడాదికి 13500 ప్రభుత్వం అందిస్తున్నదని ఆయన తెలిపారు. రైతులకు సాయం చేయాలనే ఈ ఆలోచన గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదని ప్రజలు మీరే ఆలోచించుకోవాలన్నారు. ఇంకా రైతులకు విత్తనాలు మొదలుకొని పంటల అమ్మకం వరకు ప్రభుత్వపరంగా అవసరమైన సూచనలు, సలహాలు ఆర్బీకేల ద్వారా ఇస్తున్నామన్నారు.ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 10778 రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. ఇదే సందర్భంలో గతంలో పగలు రాత్రి కలిపి కనీసం ఏడు గంటలకు కూడా విద్యుత్ సరఫరా ఇవ్వలేని చంద్రబాబు, రైతులు సంక్షేమ గురించి మాట్లాడే అర్హత ఉందాని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. కానీ మన ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కేవలం పగలు విద్యుత్తు సరఫరా నిరంతరంగా 9 గంటల పాటు అందిస్తూ రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకోవడం జరిగిందన్నారు.
వాస్తవానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం 1700 కోట్లు వ్యయం చేసి, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడం జరిగిందన్నారు. పంటల బీమా కొరకు రైతులు ఒక రూపాయి కట్టకుండా రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు అండగా నిలిచి, ఏ సీజన్లో వ్యవసాయ సీజన్ కు ముగియక ముందే భీమా అందించడం జరుగుతుందన్నారు. కానీ చంద్రబాబు నాయుడు రైతుల నుంచి ప్రీమియం సొమ్ము వసూలు చేసి, రైతులకు కనీసం బీమా కూడా అంది ఇవ్వలేని విషయాన్ని ఈ సందర్భంగా రైతులు గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో కేవలం బీమా కింద 7500 కోట్లు, 54 లక్షల 45 వేల మంది రైతులకు అందడం జరిగిందన్నారు.