ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. రైతు బంధుపై కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు పంట పెట్టుబడి కింద ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి గతంలో ప్రభుత్వం అమలు చేసిన పథకం ఇది. ఈ పథకం అమలు తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్ష నిర్వహించారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సహా రైతు బంధు అమలుతో ముడిపడి ఉన్న వివిధ శాఖల అధికారులు, విభాగాధిపతులు ఇందులో పాల్గొన్నారు.
సమావేశం ముగిసిన అనంతరం దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు తుమ్మల నాగేశ్వర రావు. ఇప్పటివరకు రాష్ట్రంలో 40 శాతం మందికి రైతు బంధు కింద నిధులను విడుదల చేసినట్లు వెల్లడించారు. 27 లక్షలమంది రైతులకు సాయం అందినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి త్వరలోనే నిధులను విడుదల చేస్తామని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా రైతులు యాసంగి పనుల్లో నిమగ్నం అయ్యారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతు బంధు నిధులను త్వరితగతిన విడుదల చేయాలని తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీ నుంచి నిధుల పంపిణీని చేపట్టాలని సూచించారు. ప్రతి రోజూ నిధుల పంపిణీ చేపట్టాలని పేర్కొన్నారు