తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక, వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది. మరోవైపు.. మే 30వ తేదీన కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు తెలంగాణలో జూన్ ఐదు, ఆరో తేదీల్లో విస్తరించనున్నాయి. రుతుపవనాల రాకతో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. ఉపరితల ఆవర్తనం కారణంగా నేడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఎల్లో అలర్ట్ విధించింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఇక, హైదరాబాద్‌లో ఈరోజు మధ్యాహ్నం నుంచి వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.