హైదరాబాద్, ఆంధ్రప్రభ : అకాల వర్షం మరోసారి రైతులను నిండా ముంచింది. అన్నదాతపై పగబట్టిన అకాల వర్షాలు కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యాసంగిలో చె డగొట్టు వానలు, వడగళ్లు పంటలపై విరుచుకుపడు తున్నాయి. దీంతో ధాన్యం అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతుల పరిస్థితి కడుదయనీయంగా ఉంది. సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం కురి సిన వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వరి, మొక్కజొన్న ధాన్యం మళ్లి తడిసిపోయింది.
అకాల వర్షాలకు ఈదురుగాలులు, పిడుగులు కూడా తోడవడంతో రైతుల కళ్లముందే కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వరదలో కొట్టుకు పోయిన దయనీయ పరిస్థితిలో రైతులు కూరుకుపోయారు. వాతావరణంలో మార్పులను చూసి ఆందోళనతో రైతులు వేగంగా ధాన్యం తూకం వేయాలని అధికా రులను కోరుతున్నా పట్టించుకునే వారేలేకుండా పోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం రవాణాకు సకాలంలో లారీలు లేవని అంటున్నారని, పరదాలు అడిగితే ఇవ్వడం లేదని, దాంతో ధాన్యం అంతా తడిసి నీటిపాలవుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదరుగాలులతో కూడిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రాశులు నీటిలో తేలాయి. ప్రధానంగా తూకం వేసిన ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించకపోవడంతో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని, ఫలితంగా ధాన్యం తడిసిముద్దయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవాణా సమస్యలతోపాటు హమాలీల కొరత, గన్నీబ్యాగులు అందుబాటులో లేకపోవడం,తూకం వేసిన ధాన్యాన్ని మిల్లర్లు సకాలంలో అన్లోడింగ్ చేయకపోవడం, దాంతో మిల్లుల వద్దే లారీలు రోజుల తరబడి ఉండిపోవడం ఫలితంగా కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని మండిపడుతున్నారు.
ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండడంతో రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. హన్మకొండ జిల్లా పరకాలలో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. మంగళవారం ఉదయం ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట పరిధిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొందరు రైతుల మొక్కజొన్న రాశులు తడిసిముద్దయ్యాయి. ధాన్యం తూకం వేయాలని 20 రోజులుగా కోరుతున్నా పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని వ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజామునుంచి కురుస్తున్న వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కొట్టుకుపోయింది. మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యంతోపాటు కాంటా వేసి బస్తాల్లో నింపిన ధాన్యం కూడా తడిసిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధిపేట జిల్లా కోహెడ, హుస్నాబాద్ మండలాల్లో కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. చేతికొచ్చిన పంట అమ్ముకునే సమయంలో నీటిపాలవ్వడంతో రైతులు కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు.
జగిత్యాల జిల్లాలోని సారాంగపూర్, రాయికల్ మండలాల్లో రైతుల కళ్లముందే కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. సారంగపూర్ మండలం పెంబట్లలో వరికోత మిషన్తో వరి కోస్తుండగా వర్షం రావడంతో చెట్టుకింద నిలబడ్డ రైతు దంపతులపై పిడుగు పడి జోగిని పద్మ అనే మహిళ మృతిచెందింది. ఆమె భర్త గంగమల్లు తీవ్రంగా గాయపడ్డాడు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి, దర్పల్లి, భీంగల్ మండలాల్లో ఈదరు గాలులతో కురిసిన వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. భీంగల్ మండలం పల్లికొండ శివారులో పిడుగుపాటుకు 48 గొర్రెలు మృత్యువాతపడ్డాయి.సిద్ధిపేట జిల్లా కోహెడ, హుస్నాబాద్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. పంట నష్టంతోపాటు పలు జిల్లాల్లో అకాల వర్షాలకు, ఈదురు గాలుల ధాటికి పలు చోట్ల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోయింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్నలు పూర్తిగా తడిచిపోయాయి. మక్కలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. దాదాపు 2వేల బస్తాల మక్కలు తడిచిపోయినట్లు రైతులు వాపోయారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, చెన్నూరులో వర్షం బీభత్సం సృష్టించింది. వడ్లు తూకం వేసి 20 రోజులు గడిచినా రవాణా చేయకపోవడంతోనే అకాల వర్షానికి వడ్లు తడిసిపోయాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదే జిల్లా బెల్లంపల్లి మండలంలోని నెన్నెలపల్లి, మైలారంలో లారీల కొరతతో ధాన్యం తరలించకపోవడంతో అకాల వర్షానికి బస్తాల్లోని ధాన్యం పూర్తిగా తడిచిపోయింది.
కడుపు మండి రోడ్డెక్కిన అన్నదాతలు
ధాన్యాన్ని అమ్ముకునేందుకు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఎదురు చూసినా తూకం పూర్తికాకపోవడం, రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో అధికారులు, మిల్లర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం తూకం కోసం ఇంకా ఎన్ని రోజులు ఓపికపట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం బొంపల్లి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిరసన చేపట్టారు. పరిగి- మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై వరి ధాన్యానికి నిప్పుపెట్టి గంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రైతులు రోడ్డెక్కారు. రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో రైతులు ఆందోళన నిర్వహించారు. రహదారిపై బైఠాయించిన రైతులు వరి ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగులబెట్టారు. సకాలంలో ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి ధాన్యం తడిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మాచారెడ్డి మండలం ఆరేపల్లిలో రైసు మిల్లు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ట్రాక్టర్లు రోడ్డుకు అడ్డంగా పెట్టి రాస్తారోకో చేశారు. మూడు రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ నిరసన చేపట్టారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసనలకు మద్దతుగా పెద్దపల్లి జిల్లా రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు, జిల్లా కలెక్టరేట్ ఎదుట భాజపా కార్యకర్తలు నిరసనలు తెలిపారు.