ఉమ్మడి ఖమ్మం-ఆంధ్రప్రభ బ్యూరో ఖమ్మం జిల్లాలో నేటికీ వర్షాల జాడ లేదు. రాష్ట్రంలో నాలుగైదు రోజుల కిందట నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఆ ప్రభావం జిల్లాలో లేకపోవడంతో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. ప్రతి రోజూ సాయంత్రం మేఘాలు ఊరించడం, చిరు జల్లు పడడం తప్ప వర్షాలు పడటం లేదు. భూములు పదునెక్కేలా ఒక్క వర్షం కూడా పడలేదు. వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
సాగుకు సిద్ధం చేసిన భూములు
ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ కోసం భూములను రైతులు సిద్ధం చేశారు. ఈ ఏడాది వరి సాగుకు 2,83,943 ఎకరాలు, పత్తి సాగుకు 2,01,834 ఎకరాలు, మిర్చి సాగుకు 88,906 ఎకరాలు, మొక్కజొన్న సాగుకు 3,374 ఎకరాలు, కంది సాగుకు 1,005 ఎకరాలు, చెరుకు సాగుకు 2,432 ఎకరాలకు రైతులు రెడీగా ఉన్నారు. వరుణుడి కరుణ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
విత్తనాలు కూడా సిద్ధం
ఖరీఫ్ నిమిత్తం ఖమ్మం జిల్లాలో 70,986 క్వింటాళ్ల వరి విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. అదేవిధంగా 5 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచారు. 90 క్వింటాళ్ల మిర్చి విత్తనాలు, 135 క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలు, 1229 క్వింటాళ్ల పెసర విత్తనాలు కూడా రెడీగా ఉన్నాయి. నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ చర్యలు చేపట్టారు.
అందుబాటులో ఎరువులు
ఖరీఫ్‌లో రైతులకు కావలసిన యూరియా, డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్, ఎస్ఎస్ పి రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం రెండు లక్షల 24 వేల 819.88 మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీకి అధికారులు సిద్ధం చేశారు.