హెచ్చరికలు జారీ చేసిన యంత్రాంగం
డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా
ఉండాలని మంత్రి పొన్నం సూచన
ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హితవు
అంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – జంట నగరాలలో ఈ సాయంత్రం భారీ వర్షం వచ్చే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. . జీహెచ్‌ఎంసీ, జలమండలి, డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నీళ్లు నిల్వ ఉండే 141 పాయింట్ల వద్ద జీహెచ్‌ఎంసీ సిబ్బండి ఉండి నీళ్లను వెంటనే క్లియర్ చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని చెప్పారు. వర్షం కురిసినప్పుడు విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అయిదు రోజుల పాటు భారీగా వర్షాలు
రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని, ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.