సిరికొండ, మార్చి 25 ( ప్రభన్యూస్ ) : నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం చీమన్ పల్లి, తాటిపల్లి గ్రామాలలో శనివారం సాయంత్రం కురిసిన వడగల్ల వానకు వందల ఎకరాలలో చేతికొచ్చిన వరి పంట నేల పాలయ్యింది. ఆరు గాలం కష్టపడి పండించిన పంట నాశనమవుతుంటే రక్షించుకోలేక రైతులు విలవిలాలాడుతున్నారు. వడగల్ల వర్షానికి తాటిపల్లి, చీమన్ పల్లి గ్రామాలకు చెందిన రైతుల పరిస్థితి దయానియంగా మారింది. రేపో మాపో చేతికి వచ్చిన వరి పంట కోతలు మొదలు పెడుదామనుకున్న దశలో రైతుల పాలిట వడగల్ల వర్షం శాపంగా మారింది. ప్రకృతి అన్నదాతను పగభాట్టిందేమో అనే దిగులు రైతులను పట్టి పీడిస్తుంది. పోయిన ఏడు సిరికొండ మండలం చీమన్ పల్లి, దుప్య తాండలలో కురిసిన వడగల్ల వర్షానికి వడ్లు నేల రాలి రెండు వందల ఎకరాలలో తీవ్రంగా పంట నష్టం జరిగింది.
రెవెన్యు అధికారులు ప్రాథమికంగా అందించిన లెక్కల ప్రకారం. తాటిపల్లి గ్రామంలో 9 వందల ఎకరాలు, చీమన్ పల్లి గ్రామ పంచాయతి పరిధిలోని చౌక్ల నాయక్ తాండ,జినిగ్యాల, చీమన్ పల్లి గ్రామాలలో 3 వందల ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు డిప్యూటీ తహసీల్దార్ ప్రవీన్ కుమార్ తెలిపారు.
కాని ఆయా గ్రామాల ప్రజలు అందించిన వివరాల ప్రకారం. అధికారుల లెక్కల కంటే ఎక్కువ పంట నష్టం జరిగిందని అంటున్నారు.
ప్రకృతి విపత్తు వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచన వేసి నష్టపరిహారం అందించి మమ్ములను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
సిరికొండ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు లోనయ్యారు.
కొండూర్ గ్రామంలో అరబోసిన వరి ధాన్యం సాయంత్రం కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యింది.