Friday, November 22, 2024

TS | రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్ష సూచన.. ఎల్లో అలెర్ట్‌ జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇరవై రోజులుగా ఎండ వేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణశాఖ తీపి కబురు చెప్పింది. అదే సమయంలో పాతాళానికి పడిపోయిన భూ గర్భజలాలతో పలు చోట్ల వరి పంటకు నీటి కొరత ఏర్పడింది. ఈ తరుణంలో రానున్న రెండు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రంలో తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆదిలాబాద్‌, కొమరంభీం ఆసీఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లలకు ఎల్లో అలెెర్ట్‌ను జారీ చేసింది. అదేవిధంగా మంగళవారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం నుంచి తరిగి రాష్ట్ర వ్యాప్తంగా పొడివాతావరణం నెలకొంటుందని తెలిపింది.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. మరో ద్రోణి విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కోస్తా ఆంధ్ర వరకు ఆవరించి ఉంది. ఆవర్తనం, ద్రోణి సముద్రమట్టానికి దాదాపు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నాయి. అదేవిధంగా దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఒక ఎత్తైన ఉపరితల ద్రోణి ఏర్పడింది.

వీటి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్ల్రో ఓ మోస్తరు వానలు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో ఆది, సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ కోస్తాలో కూడా పరిస్థితి అలాగే ఉంటుందని అంచనా వేసింది. రాయలసీమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

ఉపరితల ద్రోణి ప్రభావంతో ఖమ్మం, నల్గొండ జిల్లాలు మినహాయించి తెలంగాణలో మూడు రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రాత్రిపూట ఖమ్మం, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జంటనగరాల్లో సాయంత్రం వర్షాలు పడే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్‌ నగరంలో ఆకాశం మేఘావృతమైంది. రెండు రోజులపాటు సాయంత్రం సమయాల్లో జంటనగరాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement