Tuesday, November 26, 2024

TS | నాలుగు రోజులపాటు వర్ష సూచన.. వాతావరణ కేంద్రం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాగల నాలుగు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 27 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.1 డిగ్రీలుగా ఉంది. దీంతో గాలిలో తేమ 41 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇక హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కావున పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

అలాగే ఏపీలోని ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. బుధవారం నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయంటున్నారు. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులకు అవకాశం ఉందని తెలిపారు. కాగా… గురువారం నగరంలోని పలు చోట్ల వర్షం కురిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement