హైదరాబాద్ – ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రతిరోజూ మూడు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జన ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. గత తొమ్మిదిన్నరేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించడంతో పాటు బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు చేరవేస్తున్నారు. ఇక పోలింగ్ కు సమయం కొద్దిరోజులే ఉండటంతో పార్టీ శ్రేణులు అన్నీ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. ఇందులోభాగంగా రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వారం రోజులు ముందే షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా 5 రోజులే ఉండటంతో బీఆర్ఎస్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే నిన్నటి నుంచి నగరంలో వర్షం పడుతుండటంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇంకా మూడురోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో రేపు పరేడ్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ సభ రద్దైంది. త్వరలోనే మరో తేది ప్రకటిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు..