Saturday, November 23, 2024

రైల్వే బడ్జెట్‌ను పునరుద్ధరించాలి.. సాధారణ బడ్జెట్‌తో కలపడం సరి కాదు: బోయినపల్లి వినోద్‌ కుమార్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రైల్వే బడ్జెట్‌ను పునరుద్ధరించాలని, సాధారణ బడ్జెట్‌తో కలపడం సరైంది కాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. శనివారం సికింద్రాబాద్‌ రైల్‌ కళారంగ్‌లో జరిగిన రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగుల జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ గతంలో మాదిరిగా రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగానే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని అన్నారు. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌ తో కలపడంతో అగమ్యగోచరంగా మారుతోందని పేర్కొన్నారు.

రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెడితే ఎన్ని కొత్త రైళ్లు రానున్నాయి, ఎన్ని కొత్త రూట్లు వస్తున్నాయి వంటి సమగ్రమైన వివరాలు తెలిసే అవకాశం ఉండదని ఆయన అన్నారు. సాధారణ బడ్జెట్‌తో కలిపి కాకుండా రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగానే పార్లమెంటులో ప్రవేపెట్టే విధానాన్ని పునరుద్ధరించాలని వినోద్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రైల్వే శాఖను ప్రైవేటుపరం చేసే ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని వినోద్‌ కుమార్‌ కేంద్రానికి డిమాండ్‌ చేశారు. రైల్వే శాఖను ప్రైవేటుపరం చేయడం ద్వారా రిజర్వేషన్‌ సౌకర్యాలను కోల్పోయి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతీయువకులకు తీరని అన్యాయం జరుగుతుందని వినోద్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియన్‌ రైల్వే శాఖ రవాణా, ఉద్యోగ అవకాశాలు కల్పించే రైల్‌ గ్రిడ్‌గా ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా తర్వాత 4వ అతిపెద్ద సంస్థ అని ఆయన తెలిపారు. ఇండియన్‌ రైల్వే ఒక లక్ష 23 వేల 542 కి.మీ. ట్రాక్స్‌ కలిగి ఉందని, 7,300 రైల్వే స్టేషన్స్‌ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 8.1 బిలియన్‌ ప్రయాణీకులను, 1.23 బిలియన్‌ సరుకులను గమ్యాన్ని చేర్చిన ఘనత ఇండియన్‌ రైల్వే శాఖకు దక్కుతుందని, సుమారు 1.3 బిలియన్‌ ఉద్యోగులు కలిగిన శాఖ అని వినోద్‌ కుమార్‌ వివరించారు. అంతటి ఘన చరిత్ర కలిచిన రైల్వే శాఖను ప్రైవేటుపరం చేయడం తగదని, రైల్వేను ప్రైవేటు పరం చేసే ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని వినోద్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement