Saturday, November 23, 2024

Ministers: రాహుల్ నిజంగా పప్పే… విరుచుకుపడ్డ తెలంగాణ మంత్రులు

రాహుల్ గాంధీ నిజంగా పప్పేనని తెలంగాణ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు అన్నారు. అసెంబ్లీలోని బీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ… ఇక్కడి సన్నాసులు ఏది రాసిస్తే అది చదివేందుకు రాహుల్‌ అవసరం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదని విమర్శించారు. ఖమ్మం సభలో రాహుల్‌ వ్యాఖ్యలు చూస్తే ఆయన పప్పే అనేది నిజమని తేలిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఉన్నాయా అని నిలదీశారు. ఛత్తీస్‌గఢ్‌లో వృద్ధాప్య పెన్షన్‌ రూ.500, రాజస్థాన్‌లో రూ.750 ఇస్తున్నారని అదే తెలంగాణలో వికలాంగులకు రూ.4వేలు ఇస్తున్నామని చెప్పారు. ముందుగా కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల్లో రూ.4 వేలు పింఛన్‌ ఇవ్వాలన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ దేశంలో అవినీతికి అడ్రస్‌గా మారిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే రూ.80వేల కోట్లతో అని, దీనిలో లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎలా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగినన్ని స్కాములు ఎక్కడా జరుగలేదని, మీరు స్కాములకు రారాజులని విమర్శించారు. రాహుల్‌ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో మార్పుకోసం వచ్చిన పార్టీ బీఆర్‌ఎస్‌ అన్నారు. తామెవరికీ ఏ టీమ్‌, బీ టీమ్‌ కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీయే ఏ టీమ్‌, బీ టీమ్‌గా మారుతున్నారని విమర్శించారు. ఈటల, రేవంత్‌రెడ్డి రహస్య భేటీ నిజం కాదా అని నిలదీశారు. ఎవరు, ఎవరికి బీ టీమో ఇప్పుడు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పేద ప్రజల అవసరాలు, కష్టాలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని చెప్పారు.

కాంగ్రెస్‌ నాయకులు అవకాశవాదులని మంత్రి పువ్వాడ అజయ్‌ విమర్శించారు. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే ఉన్నారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 100 స్థానాలు గెలుచుకుంటుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్‌లో చేరినవారంతా ప్రజలు తిరస్కరించిన వాళ్లేనని విమర్శించారు. 2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే ఇంత మంది చనిపోయేవారు కాదన్నారు. విధి లేని పరిస్థితుల్లోనే అనివార్యంగా కాంగ్రెస్ పదేళ్ల ఆలస్యంగా తెలంగాణ ఇచ్చిందన్నారు. రాష్టం పదేళ్లు ఆలస్యం కావడం వల్ల తెలంగాణ అభివృద్ధి వెనక్కు నెట్టబడిందని.. దానికి కాంగ్రెస్ కారణం కాదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎం .ఎస్. ప్రభాకర్, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, సురేందర్, సండ్ర వెంకట వీరయ్య, తదితరులున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement