Saturday, September 14, 2024

TG: చైనా ఆలోచనలను అమలు చేస్తోన్న రాహుల్ గాంధీ.. బండి సంజ‌య్

మువ్వెన్నెల జెండా మనందరి ఆత్మగౌరవ ప్రతీక
మహనీయుల త్యాగాలను స్మరించుకునేందుకే
‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

ఉమ్మడి కరీంనగర్, ప్రభ న్యూస్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చైనా ఆలోచనలను అమలు చేసే వ్యక్తి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. చైనా ఆదేశాలతోనే బంగ్లాదేశ్ ఘటనపై రాహుల్ గాంధీ నోరు విప్పడం లేదని విమర్శించారు. నెహ్రూ కుటుంబానికి రాజకీయ లబ్దికోసం దేశ మహనీయుల త్యాగాలను కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నారని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనను తెరమరుగు చేస్తున్నారని మండిపడ్డారు. స్వతంత్ర్య ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంతో పాటు మహనీయుల త్యాగాలను స్మరించుకునేందుకు ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.

భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ నుండి భారీ ఎత్తున ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రను ప్రారంభమైంది. బండి సంజయ్ ఈ యాత్రకు విచ్చేసి తెలంగాణ చౌక్ నుండి టవర్ సర్కిల్ వరకు నడిచారు. భారీ ఎత్తున తరలివచ్చిన యువకులు, విద్యార్థులు మువ్వెన్నెల జెండాను చేత పట్టుకుని మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ కదం తొక్కారు. బండి సంజయ్ తో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగారు. అంతకుముందు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ…. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను నిర్వహిస్తున్నారు.

- Advertisement -

మూడు రంగుల జాతీయ జెండా… మనందరి ఆత్మగౌరవ పతాకం. జెండా, ఎంజెడాలను పక్కనపెట్టి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లపై మువ్వెన్నల జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్. అట్లాగే ఎంతో మంది మహనీయులు దేశం కోసం బలిదానం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం నెహ్రూ కుటుంబానికి లబ్ది చేయడమే లక్ష్యంగా చరిత్రను తెరమరుగు చేసే యత్నం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలని చూస్తోందన్నారు.

అంబేద్కర్ ఆలోచనలు లేకుండా చేయాలని కుట్ర చేస్తోందన్నారు. కుల, మత, ప్రాంతాల పేరుతో ప్రజలను చీల్చే కుట్రలు చేస్తోందన్నారు. నెహ్రూ అరాచక, అనాలోచిత విధానాల వల్ల విభజన గాయాలు ఇంకా మనల్ని వెంటాడుతున్నాయని అన్నారు. రాహుల్ గాంధీ మాత్రం అంకుల్ శ్యాం పిట్రోడా వాడుతున్న అమెరికా భాషను ఉపయోగిస్తున్నడన్నారు. చైనా ఆలోచనను అమలు చేసే వ్యక్తి రాహుల్ గాంధీ అని, బంగ్లాదేశ్ పై రాహుల్ నోరెందుకు విప్పడు? అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement