Saturday, November 23, 2024

ఆగస్టు 21న రాష్ట్రానికి రాహుల్‌.. బీజేపీ విజయ సంకల్ప సభకు దీటుగా జన సమీకరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ఇక్కడి పరేడ్‌ మైదానంలో నిర్వహించిన విజయ సంకల్ప సభకు ధీటుగా ఆగస్టు 21న భారీ బహిరంగ సభ ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వరంగల్‌లో నిర్వహించిన రైతు డిక్లరేషన్‌ సభకు అంచనాలకు మించి జనం హాజరు కావడంతో మంచి ఊపుతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరో బహిరంగ సభ నిర్వహణకు సిద్ధమయ్యారు. ఇటీవల ఢిల్లి వెళ్లి పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో సమావేశమైన రేవంత్‌ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో నిరుద్యోగ డిక్లరేషన్‌ సభను నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సభకు రావాలని రేవంత్‌ కోరగా అందుకు రాహుల్‌ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ సభ నిర్వహణకు సంబంధించి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌ ముఖ్య నేతలతో ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సమాలోచనలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చి విస్మరించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించాలని నిర్ణయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా ఉద్యోగాల భర్తీ విషయాన్నే మరిచిపోయారని ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న హామీ ప్రకటనకే పరిమితమైందని రేవంత్‌ దుయ్యబట్టారు. నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన తెరాస నియామకాల విషయాన్ని పట్టించుకోవడం లేదని రాష్ట్రంలో 17వేల ఉపాధ్యాయుల ఖాళీలు, మూడువేలకుపైగా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల ఖాళీలు, వందల కొద్ది బోధనేతర సిబ్బంది ఖాళీలున్నా భర్తీ చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎదురు దాడే లక్ష్యంగా ఆగస్టు 21న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభకు సమాయత్తమైంది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న రాహుల్‌ గాంధీ పర్యటనపై తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీకి ఏఐసీసీ ఇప్పటికే సమాచారం అందించింది. నిరుద్యోగ సమస్యలపై నిరుద్యోగ డిక్లరేషన్‌ పేరుతో ఈ సభను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన విశ్వవిద్యాలయాల నుంచి నిరుద్యోగ యువతను, విద్యార్థులను పెద్ద ఎత్తున తరలించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆయా విశ్వవిద్యాలయాల వారీగా ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌ సమావేశాలను నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రాహుల్‌ గాంధీ ద్వారా నిరుద్యోగ డిక్లరేషన్‌ను ప్రకటించి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ భర్తీకి సంబంధించిన క్యాలెండర్‌ను ఈ సభ వేదిక ద్వారా ప్రకటించనున్నట్టు సమాచారం. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో ఈనెల 3న నిర్వహించిన విజయ సంకల్ప సభకు మించి సిరిసిల్ల బహిరంగ సభను నిర్వహించి ఈ సభకు జనసమీకరణ చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. 80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 2018లో జరిగిన అసెంబ్లిd ఎన్నికల సమయంలో ప్రతి నెలా నిరుద్యోగ యువతకు రూ.3వేల భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చి ఆ వాగ్దానాన్ని కూడా విస్మరించిన విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతో పాటు పొరుగున ఉన్న వరంగల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, పెద్దపల్లి, మంచిర్యాల, గోదావరి ఖని, నిర్మల్‌ తదితర ప్రాంతాల నుంచి సిరిసిల్ల బహిరంగ సభకు పెద్దఎత్తున జనాన్ని సమీకరించేందుకు ఆయా జిల్లాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వరుస సమావేశాలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే కోరినట్టు ప్రచారం జరుగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement