Tuesday, November 19, 2024

TS: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రాహుల్, రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గ‌త రాత్రి తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలను కోరారు. మరోవైపు, కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. మరోసారి అధికారంలోకి వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ఆరోపణలు గుప్పించారు. కాగా, సరూర్‌నగర్ జన జాతర సభ అనంతరం హైదరాబాద్ సిటీ బస్సులో సందడి చేసిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి.. తిరుగు ప్రయాణంలో దిల్‌సుఖ్‌నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ కరపత్రాలు అందించారు రాహుల్ గాంధీ.

తెలంగాణలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి మహిళలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ గురించి ప్రయాణికులకు ఆయన వివరించారు. ఈ సందర్భంగా రాహుల్, రేవంత్‌తో ప్రయాణికులు ఫొటోలు దిగారు.

అంతకుముందు సరూర్‌నగర్ సభలో రాహుల్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీపై విమర్శల దాడికి దిగారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆర్‌ఎస్సెఎస్‌ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని రాహుల్ ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించి అన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారని, క్రమంగా ప్రైవేటీకరణ పెంచి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ ఆలోచన అని రాహుల్ ఆరోపించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement