హైదరాబాద్, ఆంధ్రప్రభ: దక్షిణ తెలంగాణకు జీవధార కృష్ణానది ప్రవాహాలు క్రమేణ తగ్గిపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభమై నెలగడుస్తున్నా వరుణుడు కనికరించకపోవడంతో పరివాహక ప్రాంతాల్లోని జలాశయాల్లో క్రమేణ నీటి జాడలు కనుమరుగవుతున్నాయి. గత సంవత్సరం జూలైలో ముంచెత్తిన కృష్ణా నది ప్రస్తుతం మూగబోయింది. 2002, 2003, 2015, 2016లో కృష్ణపరివాహక ప్రాంతాల్లో కరువు పరిస్థితి నెలకొనడంతో పంటల దిగుబడి తగ్గడంతో పాటుగా రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రసుతం అదే పరిస్థితి పునరావృతం అయ్యింది. ఉత్తరతెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. వర్షాబావ పరిస్థితులున్నప్పటికీ కాళేశ్వరం జలాలతో చెరువులు,కుంటలు, శ్రీరాంసాగర్ తదితర జలాశయాలకు నీటి సరఫరాఉండటంతో ఎక్కడికక్కడ పంటలు వేస్త్తున్నారు.
అయితే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో పాలమూరు ప్రాజెక్టు పెండింగ్ లో పడటంతో నీటి నిల్వసామర్థ్యం కరువై జలాశయాల్లో నీరు అడుగంటుంతుంది. కృష్ణానది ఉపనదుల పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. ప్రధానంగా భీమా, డిండీ, మూసీ, హాలియా, పాలేరు, మున్నేరు నదుల ప్రవాహం తగ్గడంతో వీటి ఆధారంగా ఉన్న జలాశయాల నీటినిల్వలు తగ్గిపోతున్నాయి. కృష్ణా నది కర్ణాటక దాటిన అనంతరం తెలంగాణలోని మొదటి ప్రాజెక్టు జూరాల ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టు నీటి సామర్ధ్యం తక్కువగా ఉంది. ఆతర్వాత నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కీలకంగా ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టుల్లో నీటినిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి.
వర్షాలు కురువకపోవడంతో పాటుగా వాతావరణంలోని వేడితో ఆవిరినష్టాలతో ఈ ప్రాజెక్టులు తల్లడిల్లుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురిస్తే ఆ ప్రవాహం ఆల్మటికి చేరుకుని ఆల్మట్టి నిండగానే ఆనీరు కృష్ణలో చేరి మహబూబ్ నగర్ జిల్లాలోని తంగిడి నుంచి రాష్ట్రానికి చేరుకుంటుంది. అక్కడినుంచి ప్రవహిస్తూ ప్రాజెక్టులను నింపుకుంటూ సాగే కృష్ణమ్మ ప్రవాహం వరుణుడి కరుణపైనే ఆధారపడి ఉంటుంది. ఆల్మట్టి 1705 ఫీట్ల ఏఫ్ఆర్ఎల్ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 1697.11 ఉంది. అలాగే ప్రాజెక్టులో నీటి సామర్ధ్యం 129.72 టీఎంసీలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 106.10ఉంది. ఈ ప్రాజెక్టు నిండితేనే కానీ తెలంగాణలోకి వరదలు వచ్చే అవకాశాలున్నాయి. లేదంటే కురిసే వర్షాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది.
జూరాల లో 9.66 టీఎంసీల నీటి నిల్వసామర్ధ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం కేవలం 3.60 టీఎంసీలు, శ్రీశైలంలో 215 టీఎంసీలకు నీటి నిల్వలో ప్రస్తుతం కేవలం 182.02 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ 312.05 టీఎంసీల నీరు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 165.31 టీఎంసీలకు నీటి నిల్వలు చేరుకున్నాయి. ప్రధానప్రాజెక్టులను పరిశీలిస్తే శ్రీశైలం జలవిద్యుత్ కు నీటి సరఫరా చేయడంతో పాటుగా ఎడమకాల్వద్వారా నల్గొండజిల్లాలోని 2లక్షల 70 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉంది.అలాగే 212 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల తాగునీరు ఈ ప్రాజెక్టు పైనే ఆధారపడాల్సి ఉంది. నాగార్జున సాగర్ ఎడమకాలువ రాష్ట్రంలో 179 కిలోమీటర్లు ప్రయాణిస్తూ పసిడి పంటలను పండిస్తోంది.
ఈ కాలువ నీటితో నల్గొండలో 3లక్షల 72వేల 970 ఎకరాలకు సాగునీరు అందటంతో పాటుగా ఖమ్మం లో 3లక్షల 46వేల 769 ఎకరాలకు నీరు అందిస్తోంది. జూరాల ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గద్వాల, అలంపూర్ లో లక్షా 20వేల ఎకరాలు, ఎడమకాలువతో కొల్లాపూర్, ఆత్మకూరు, వనపర్తిలో 64వేల ఎకరాలకు నీరు అందిస్తోంది. అలాగే కృష్ణా నది ఉపనదులు మరో 7నుంచి 9 లక్షల ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. ప్రస్తుత వర్షాబావ పరిస్థితుల్లో కృష్ణా పరివాహక ప్రాంతాల వ్యవసాయ క్షేత్రాలకు సాగునీరు ప్రశ్నార్థకమైంది. వర్షాలు కురవని పక్షంలో 2002 నించి 2016 వరకు వచ్చిన వరుస కరువులు పునరావృత్తం అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి