ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లీంల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా గోల్లగుడెం ఈద్గా నందు ప్రార్థనలో పాల్గొని నమాజ్ చేశారు. అనంతరం ముస్లిం సోదరులను ఆత్మీయ ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది, అల్లా దయతో ప్రజాలంతా సుఖసంతోషాలతో ఉండాలని, అల్లా బోధనలు సమాజానికి ఆదర్శమన్నారు. సమాజానికి ఉపయోగడే అల్లా బోధనలను ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, తెలంగాణ రాష్ట్రంలో సర్వమత సామరస్యంతో ఉందన్నారు.ముస్లింల అభివృద్ధికి రూ.వేల కోట్ల నిధులు, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తూ సీఎం కేసీఆర్ పరిపాలన దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు మైనార్టీలను ఓటు బ్యాంక్ లా మాత్రమే చూశారని, మైనార్టీల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదన్నారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సర్వమత సామరస్యం పరిఢవిల్లుతున్నదని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే విధంగా ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నదన్నారు.
తెలంగాణ వచ్చాక ప్రభుత్వమే ప్రజల పండుగలు నిర్వహించే గొప్ప సంసృతిని సీఎం కేసీఆర్ మొదలుపెట్టారని, గంగా జమునా తేహజీబ్ సంస్కృతికి తెలంగాణ నేల ప్రసిద్ది అన్నారు.
లౌకికవాదాన్ని, మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్య, ఉపాధితో పాటు పలు రంగాల్లో ఆసరానందిస్తూ ప్రభుత్వం ముస్లింలకు భరోసాగా నిలిచిందన్నారు. స్వయం పాలనలో గడచిన తొమ్మిదేండ్ల కాలంలో మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి కోసం రాఫ్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 13 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నదని, మైనారిటీల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పలు పథకాలు, ప్రగతి కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతర కృషి చేస్తున్నారని, తెలంగాణలో అమలవుతున్న ముస్లిం మైనారిటీ అభివృద్ధి మోడల్‌ను దేశవ్యాప్తంగా విస్తరింపచేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ముస్లింలకు షాదీముబారక్, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, రంజాన్ కానుకగా దుస్తులు పంపిణీ, 408 మైనార్టీ గురుకుల పాఠశాలలను నెలకొల్పిన ఘనత కేసీఆర్‌దే అని వివరించారు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి కోకాపేటలో 10 ఎకరాల స్థలం కేటాయించి భవన నిర్మాణానికి రూ.40కోట్లు మంజూరు చేయడం జరిగిందని, వక్ఫ్‌బోర్డులో నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ.53కోట్లు గ్రాంట్‌గా ప్రభుత్వం అందించిందన్నారు.
రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేయడమే కాకుండా దాని నిర్వహణకు రూ.40కోట్లు కేటాయించడం జరిగిందని, తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్న కేసీఆర్ ని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత మనపైనే ఉందన్నారు. ఈ సందర్భంగా ఈద్గా చుట్టూ ప్రహరీ నిర్మించాలని పలువురు ముస్లిం మత పెద్దల విజ్ఞప్తి మేరకు స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయా నిర్మాణంకు అయ్యే ఎస్టిమేషన్ ను తయారు చేయించి తన CDP నిధుల నుండి అయ నిర్మాణం ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆనందోత్సహాలతో కుటుంబసమేతంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని, ముస్లిం సోదర, సోదరీమణులకు మరోసారి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు.