Friday, November 22, 2024

సబ్సిడీ రుణాలను బీసీలు ఉపయోగించుకోవాలి – మంత్రి పువ్వాడ

ఖమ్మం, ఆగస్టు 8 : వృత్తిదారులకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి వంద శాతం సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు అందిస్తున్నదని, ఇకపై నియోజకవర్గానికి 300 మందికి చొప్పున ప్రతి నెలా పంపిణీ చేయనున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రం విడివోస్ కాలనిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బిసి సంక్షేమ శాఖ అధ్వర్యంలో బిసి కుల వృత్తిదారులకు రూ. లక్ష సాయం పథకానికి సంబంధించి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ది, పేదల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. తెలంగాణ అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్నదని అన్నారు. కుల వృత్తులకు గ్రాంట్ గా లక్ష రూపాయలు అందచేసి వారి పనిముట్లు కొనుగోలు చేసుకోవడానికి సహాయ పడాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు అందిస్తున్నదని వివరించారు. నియోజకవర్గానికి 300 మందికి ప్రతి నెల ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో అర్హులైన మొత్తం 14808 మందిని అధికారులు గుర్తించారని వారందరికీ పంపిణి చేస్తామన్నారు.

ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చే ఈ రుణాలు లబ్ధిదారులు తమ వ్యాపార అభివృద్ధికి వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ప్రతి నెలా ఇదే సమయంలో ఈ రుణాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిరుపేదలకు, సొంత గృహాలు లేని వారి కోసమే ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ప్రవేశపెట్టినట్లు, ఈ పథకం కోసం దరఖాస్తుల సమర్పణకు జిల్లాలో ప్రతి తహసిల్దార్, మున్సిపల్, కలెక్టరేట్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి గృహలక్ష్మి క్రింద 3 వేల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వాటిని సైతం అర్హులైన దళితులకు అతి త్వరలోనే పంపిణి చేస్తామన్నారు. రైతులకు రైతుబంధు, రైతుభీమా అందిస్తున్నట్లు, గౌడలకు, నేతన్నలకు, కార్మికులకు భీమా, ఇంటింటికి నల్లా ద్వారా త్రాగునీరు, లకారం, మున్నేరు ఆర్సీసి వాల్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధిపథంలో పయనిస్తున్నట్లు మంత్రి అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, చేతి వృత్తుల మీద ఆధారపడే ప్రతి బిసి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి పర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం రూ. లక్ష సహాయాన్ని అందిస్తున్నదని తెలిపారు. జిల్లాలో 14808 మందిని అర్హులుగా గుర్తించినట్లు, అర్హులైన ప్రతి ఒక్కరికి దఫాలుగా పథక లబ్ది చేకూర్చుతామన్నారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో కార్పొరేషన్ లో 1729 మంది, రఘునాథపాలెం మండలంలో 550 మందిని అర్హులుగా ఉన్నారన్నారు. మొదటి దఫాలో నియోజకవర్గానికి 300 మంది చొప్పున జిల్లాలో 1500 మందికి ఈ నెల చెక్కులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మొత్తాన్ని వృత్తిలో పెట్టుబడిగా పెట్టి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దొరేపల్లి శ్వేత, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, సిటీ లైబ్రరీ చైర్మన్ ఆశ్రీఫ్, కార్పొరేటర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement