Saturday, January 11, 2025

TG | కబ్జాకోరులపై ఉక్కుపాదం మోపండి.. బండి సంజయ్‌

సిరిసిల్ల, జనవరి 11 (ఆంధ్రప్రభ): పేదల భూములను కబ్జాలు చేసినవారు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిపై ఉక్కుపాదం మోపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ కోరారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలు నిర్మించాలంటే, మంచి పనులు చేయాలంటే ప్రభుత్వ స్థలాలు లేకుండా పోయాయన్నారు. గత బీఆర్‌ఎస్‌ పాలకులు, కేసీఆర్‌ కుటుంబం ధరణి పేరుతో ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్‌ చేశారని మండిపడ్డారు. అలాంటి వారిని ఉపేక్షించొద్దని, బుల్డోజర్లు దించాలని కోరారు. సమాజంలో అన్ని అవయవాలు ఉన్న మనమే అనేక సమస్యలకు సతమతమవుతున్నామని, దివ్యాంగుల ఇబ్బందులు వర్ణణాతీతమన్నారు. దివ్యాంగుల మనోనిబ్బరం, ధైర్యం గొప్పవని, మనమంతా వారికి అండగా ఉంటే చాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏడీఐపీ, రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకాల కింద ఈరోజు 69లక్షల 54వేల 911 రూపాయల విలువైన 675 పరికరాలను జిల్లాలోని 322మంది దివ్యాంగులకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేవలం నాలుగేళ్లలోనే పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో దివ్యాంగులు, మహిళలు, వృద్దుల సంక్షేమం కోసం 100 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. దివ్యాంగుల, వృద్ధుల ఆశ్రమాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిదులు మంజూరు చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. తాను గత ఐదేళ్లలో ఎన్నడూ కలెక్టరేట్‌కు రాలేదని, ఏ కార్యక్రమంలో పాల్గొనలేదన్నారు. ఎందుకంటే గతంలో నన్ను ఏ కార్యక్రమానికి కూడా పిలవలేదని, కలెక్టరేట్‌కు వెళితే.. వెంటనే బాధ్యులను బదిలీ చేసే వాళ్లని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో తనను ఎన్నడూ పిలవని ఆ పార్టీ నేతలు ఇప్పుడు కలెక్టర్‌నే దూషిస్తున్నారని, అధికారులను పట్టుకుని తిట్టడం వారి అవివేకమన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కబ్జా చేసిన స్థలాలు, భవనాలన్నీ స్వాధీన పర్చుకోవాలన్నారు. గతంలో ఎకరాలకు ఎకరాలు కబ్జాలు చేసి దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమన్నారు.

ప్రభుత్వ భవనాలకు, మంచి పనులు చేయాలంటే ప్రభుత్వ స్థలాలు లేకుండా చేశారన్నారు. అలాగే సిరిసిల్ల జిల్లాలో త్వరలోనే నవోదయ స్కూల్‌ త్వరలో మంజూరు కాబోతోందని, ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయన్నారు. గతంలో ప్రసాద్‌ స్కీం కింద నిధులిస్తాం.. ప్రతిపాదనలు పంపాలని కోరితే నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించిందని, అతి త్వరలోనే వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్‌ స్కీంలో చేర్చుతామన్నారు. నేను ఎంపీగా, కేంద్ర మంత్రిగా గెలిచానంటే మీరు పెట్టిన భిక్షేనని, మీరు గెలిపిస్తేనే ఈ స్థాయికి వచ్చానని, అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు.

- Advertisement -

కేంద్రం నుండి అవసరమైన నిధులన్నీ తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగుడికి పరికరాలిచ్చి అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. ఇంకా ఎవరైనా దివ్యాంగులు మిగిలి ఉంటే వాళ్ల జాబితా కూడా సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ఇకపై ఏ ఒక్క దివ్యాంగుడి నోటి నుండి నాకు పరికరం అందలేదనే మాట రావొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ నాగుల సత్యనారాయణలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement