జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతీ నది పుష్కరాల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
ఈ పుష్కరాల కోసం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ రూ.25 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
పుష్కరాలకు లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున, వారి కోసం స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. ఈ పనులను సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.పుష్కరాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖకు ధన్యవాదాలు తెలిపారు.
కాళేశ్వరంలో ఈ పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలూ కలిసి పనిచేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సురేఖ మాట్లాడుతూ, 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సరస్వతీ నది పుష్కరాలు విజయవంతమయ్యాయని గుర్తుచేశారు. తెలంగాణ స్వరాష్ట్రంలో ఆధ్యాత్మిక వేడుకలు మరింత వైభవోపేతంగా ఉంటాయని, ఈ సారి పుష్కరాలు మరింత ఘనంగా జరుగుతాయని తెలిపారు.
సరస్వతీ నది పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఇది అత్యంత పవిత్రమైన వేడుకగా భక్తులు జరుపుకుంటారు.2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం ప్రారంభమవుతుంది. మే 15న సూర్యోదయంతో పుష్కర పుణ్యస్నానాలు ప్రారంభమవుతాయి.
పుష్కరాలు మే 26 వరకు కొనసాగుతాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పుష్కరాల నిర్వహణ తేదీలను కాళేశ్వరం ఆలయ ముఖ్య అర్చకులు నిర్ణయించగా, ఆ వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. సరస్వతీ నది త్రివేణి సంగమంలో అంతర్వాహిని (అదృశ్య నది)గా భావిస్తారు. పుష్కర సమయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు.అన్ని శాఖల సమన్వయంతో పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి సురేఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పుష్కరాలు ఘనంగా జరిగేలా తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.