జైనూర్, డిసెంబర్ 18 (ఆంధ్రప్రభ) : ప్రజలకు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు వారి సంక్షేమమే ధ్యేయంగా పోలీస్ శాఖ కృషి చేస్తుందని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అన్నారు. పోలీసు నీ కోసం కార్యక్రమంలో భాగంగా బుధవారం కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని మారుమూల గ్రామమైన పవర్ గుడలో పోలీసులు ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు, యువకులకు క్రీడా కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ… పోలీసులు ప్రజల సంక్షేమం కోసం ఉన్నారని, ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు జరిగినా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, చట్టాలను చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన కోరారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు రక్షణే కర్తవ్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తుందని, పోలీసులు రాత్రి, పగలు ప్రజల భద్రత రక్షణ కోసం కృషి చేస్తున్నారన్నారు. ఏడాది జైనూరు సిర్పూర్ మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో నిరుపేదలకు ఆదుకోవాలనే దృక్పథంతో ఉచితంగా పోలీస్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.
జైనూర్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ కుడిమేత విశ్వనాథ్ మాట్లాడుతూ… పోలీసుల ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. గతంలో కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సామాజిక సేవలు చేసి గ్రావెల్ రోడ్లు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. పోలీసుల సేవలు అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో పోలీసుల కర్తవ్యాన్ని చాటాలని ఆయన కోరారు. అనంతరం నిరుపేదలకు దుప్పట్లతో పాటు, యువకులకు క్రీడా సామాగ్రిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జైలు మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ కుడిమేత విశ్వనాథ్, జైనూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంతరావు, ఆసిఫాబాద్ డీఎస్పీ కరుణాకర్, జైనూర్ సిఐ రమేష్, ఎస్సైలు రామారావు, రామకృష్ణ, గ్రామ పటేళ్లు, నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.