ఆంధ్రప్రభ బ్యూరో ఆదిలాబాద్: అదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ లో ఉన్న ప్రధాన సమస్యలను బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలసి విన్నవించారు. హైదరాబాద్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కు అదిలాబాద్ జిల్లా సమస్యలను వినతిపత్రం రూపంలో అందించారు.
ఆదిలాబాదులో పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు నిధులు విడుదల చేసి పనులు త్వరతగతిన పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా చనాక -కొరాట ప్రాజెక్ట్ భూసేకరణ నిధుల విడుదల గురించి వివరిస్తూ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఎయిర్ పోర్టును కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా డీపీఆర్ ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రిని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విజ్ఞప్తి చేశారు. వీటిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.