ఒకే పోలీస్ విధానం అమలునకు డిమాండ్
ఎనిమిది గంటల డ్యూటీ వేయాలని వినతులు
తమతో అధికారులు వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆవేదన
హైదరాబాద్: ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటివరకు బెటాలియన్ పోలీసుల కుటుంబ సభ్యులు రాస్తారోకోలు, ధర్నాలు చేయగా నేడు ఏకంగా కానిస్టేబుళ్లు నిరసనబాటపట్టారు. రాష్ట్రంలోని అన్ని బెటాలియన్లలో కానిస్టేబుళ్లు ఆందోళనలు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో..
కాగా, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీసు కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రమంతా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ ఇబ్రహీంపట్నంలోని నాగార్జున సాగర్ హైవేపై కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. హోమ్ శాఖ సీఎం రేవంత్ చేతుల్లోనే ఉందని, తమ బ్రతుకులు కూడా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉన్నాయంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు వారిని అక్కడిని తరలించేందుకు యత్నించగా తోపులాట చోటుచేసుకున్నది. ఈ క్రమంలో మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ధర్నా ఒక్కసారిగా ఉధృతంగా మారింది. దీంతో ధర్నా కాస్తా పోలీస్ వర్సెస్ పోలీస్‌గా మారింది. అయితే వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
నల్గొండలో..
నల్లగొండలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో సిబ్బంది మరోసారి ఆందోళన దిగారు. నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబును సస్పెండ్ చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. నాలుగు రోజుల క్రితం ఆందోళన చేస్తున్న తమతో పాటు తమ కుటుంబ సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ సిబ్బంది ఆరోపించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున నినాదాలు చేస్తూ బెటాలియన్ నుంచి రోడ్డుపైకి ర్యాలీగా వస్తున్న సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు వేయడంతో సిబ్బంది బయటకు రాకుండా ఆగిపోయారు.
రాజన్న సిరిసిల్లా జిల్లాలో …
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17వ బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ దగ్గర పోలీసులు నిరసన, ధర్నాకు దిగారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేశారు. తమకు డ్యూటీలు వేసి కుటుంబాన్ని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.తమతో కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారు.. అలాగే, పెద్ద అధికారుల ఇళ్లలో పాచి పనులు, బొల్లు తోమడం, ఇళ్లు ఊడవడం, పిల్లలను స్కూల్ కి పంపడం, మందు తాగి పబ్బులో పడిపోతే తీసుకురావడంలో లాంటి వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. తమపై ఆంధ్ర అధికారుల పెత్తనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.. ఈ సందర్బంగా ధర్నా చేస్తున్న కానిస్టేబుల్ వద్దకు జిల్లా ఎస్పీ అఖిల్ చేరుకొని పోలీసులను సముదాయించారు. ఈ సమయంలో ఎస్పీ కాళ్లపై పడి తమ బాధను తీర్చాలని కానిస్టేబుల్ వేడుకున్నారు.
వరంగల్ లో ధర్నా
వరంగల్‌లోని మామునూరు ఫోర్త్ బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళనకు దిగారు. బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ ముందు బైఠాయించారు. ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏక్ పోలీస్ కావాలంటూ ప్రధాన గేటు వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. 8 గంటలకు మించి పనిచేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నినదించారు. ఉన్నతాధికారులు స్పందించి పోలీసు ఉద్యోగస్తులకు పనిభారం తగ్గించి ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.