Monday, January 20, 2025

Protest – మైలారంలో హైటెన్ష‌న్ – ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ అరెస్టు

నాగర్‌కర్నూల్ , ఆంధ్ర‌ప్ర‌భ : నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు పోలీసులను ఊరిలోకి రానీయకుండా అడ్డుకుంటున్నారు. ముళ్ల కంపలు వేసి మహిళలు, గ్రామస్తులు నిరసన తెలిపారు. మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు బ‌య‌లుదేరిన‌ పౌర హక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ ను సోమ‌వారం పోలీసులు అరెస్టు చేశారు. పౌర హక్కుల నేత అయిన ప్రొఫెసర్ హరగోపాల్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజా పాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటూ గొప్పాలు కొట్టి, ఇప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతు నొక్కడం అమానుషమ‌ని మండిపడ్డారు. హ‌రీశ్‌రావు త‌న ట్వీట్‌లో ఈ మేర‌కు పోస్టు పెట్టారు.

ఇదేనా ప్ర‌జాపాల‌న !
” సీఎం రేవంత్ రెడ్డి గారు.. ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిన మీరు కంచెలు, ఆంక్షలు, అరెస్టులతో నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారు. మీ సొంత జిల్లాలోనే ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని” అని హ‌రీశ్‌రావు రాసుకొచ్చారు. అలాగే మైలారంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రొఫెసర్ హరగోపాల్ సహా అరెస్టులు చేసిన ప్రజా సంఘాల నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement