Tuesday, November 26, 2024

Protest: రైతన్నకు అండగా గులాబీ జెండా.. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే దాసరి

అన్నం పెట్టే రైతుల‌కు గులాబీ జెండా అండగా ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జెండా కూడలిలో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు, వరిధాన్యం కొనుగోలు చేయబోమ‌నే ప్రకటనకు నిరసనగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడడం సిగ్గు చేటన్నారు. నల్ల చట్టాలపై దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమం చేపట్టడంతో మోడీ సర్కారు వెనక్కి తగ్గి చట్టాలను రద్దు చేసిందన్నారు.

మోటార్లకు మీటర్లు పెడతామనడం సరికాదని, రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్‌పై ప్రభావం పడుతుందన్నారు. పంజాబ్‌లో వరిధాన్యం మొత్తం కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణలో పండించిన వరిధాన్యం ఎందుకు కొనుగోలు చేయదని ప్రశ్నించారు. రాష్ట్ర రైతుల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని, రైతాంగం కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. యాసంగిలో పండించే వరిధాన్యం మొత్తం కేంద్ర ప్రభుత్వం కొనేంత వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. రైతుబంధు, ఉచిత విద్యుత్‌, కాళేశ్వరం జలాలతో రైతుల జీవితాల్లో వెలుగులు నిండుతుంటే కేంద్రం చేపడుతున్న వ్యతిరేక విధానాలు మరోసారి రైతులను నట్టేట ముంచేలా ఉన్నాయన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం వరిధాన్యంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మమత ప్రశాంత్ రెడ్డి తో పాటు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement