ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి రైతును రాజు చెయ్యాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాల్ని ప్రవేశ పెట్టి అభివృధ్ధికి కృషి చేస్తుంటే, రైతుల పట్ల, రైతు సంక్షేమ పథకాల పట్ల టిపీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ద్వేషంతో మాట్లాడడం అత్యంత హేయమైన చర్యని టెస్కాబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రైతులు, పార్టీ కార్యకర్తలతో నిరసనతో పాటు రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు.
రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అందిస్తున్న 24గంటల ఉచిత విద్యుత్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఏనాడు ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారి పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కి పెట్టిన రేవంత్ రెడ్డి నేడు తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నాడని అన్నారు. పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వివక్ష చూపుతున్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు కి రాబోయే ఎన్నికలలో బుద్ధి చెబుతారన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.