Wednesday, December 18, 2024

ADB | ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌కుండా చ‌ర్య‌లు.. ఎస్పీ జానకి షర్మిల

  • బాస‌ర గోదావరి నది బ్రిడ్జి పై రక్షణ
  • చుట్టూ కంచె ఏర్పాటు
  • సీసీ కెమేరాల ఏర్పాటు
  • నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌
  • నిర్మ‌ల్ ఎస్పీ జాన‌కి ష‌ర్మిల‌


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, బాస‌ర (నిర్మ‌ల జిల్లా) : బాసర పుణ్య క్షేత్రం వద్ద గోదావరి నది బ్రిడ్జి పై నుండి గోదావ‌రిలోకి దూకి తరచూ ఆత్మహత్యలకు పాల్ప‌డుతున్నారు. బాస‌ర బ్రిడ్జి పై నుంచి కుటుంబాల‌తో సహా ఆత్మ‌హ‌త్య‌లు జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ప్ర‌తి ఒక్క‌రినీ క‌ల‌చివేసింది. గోదావ‌రి నదిలోకి దూకేందుకు ఆస్కారం లేక‌పోతే కొంత స‌మ‌యం గ్యాప్ దొర‌క‌డంతో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన వారు త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటార‌ని పోలీసుల అభిప్రాయం. అందులో భాగంగా పుణ్య‌క్షేత్ర‌మైన ఇక్క‌డ ఇలా ఆత్మ‌హ‌త్య‌ల‌కు ఆస్కారం లేకుండా నిర్మ‌ల్ జిల్లా ఎస్పీ జాన‌కి ష‌ర్మిల చ‌ర్య‌లు చేప‌ట్టారు.

బ్రిడ్జి ప‌రిశీల‌న‌
గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధ‌వారం ప‌రిశీలించారు. ఆమెతోపాటు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ సీఐ మల్లేష్, ఎస్ఐ గణేష్ త‌దిత‌రులు ఉన్నారు. బాసర పుణ్య క్షేత్రం నుండి
నిజామాబాద్ జిల్లాకు వారధిగా ఉన్న ఈ బ్రిడ్జిపై నిర్మించిన వాల్ చిన్న‌దిగా ఉండ‌డంతో క్ష‌ణ‌కావేశంలో వ‌చ్చిన వారు వెంట‌నే ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డుతున్న‌ట్లు ఎస్పీ గుర్తించారు. అయితే బ్రిడ్జికు ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేస్తే ఆత్మ‌హ‌త్య‌ల‌కు వ‌చ్చే వారు మ‌ళ్లీ వెనుక్కు తగ్గే అవకాశాలు వుంటాయని ఆమె భావించారు.

ఇనుప కంచె ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లు
స్థానిక పోలీస్ స్టేషన్ లో విలేకరులతో ఎస్పీ జానకి షర్మిల మాట్లాడారు. గోదావరి నది బ్రిడ్జిపై గతంలో నిర్మించిన వాల్ చిన్నగా ఉండడం ప్రమాదాలకు అనువుగా మారిందని అన్నారు. వాల్ కు ఐదు ఫీట్ల ఎత్తుతో ఇనుప కంచే ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు నదిపై సీసీ కెమెరాలు అమర్చి స్థానిక పోలీస్ స్టేషన్‌కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షిస్తూ పోలీసు సిబ్బంది మహిళ హోంగార్డులను అందుబాటులో ఉంచుతామని అన్నారు. ప్రతిరోజు గోదావరి నదిపై బ్లూ కోట్ సిబ్బంది పర్యవేక్షిస్తుంటారని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement