Monday, November 18, 2024

ప్రాప‌ర్టీ ట్యాక్స్ వ‌సూళ్లకు యుద్ద‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టాలి : మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మీ

సర్కిళ్లవారిగా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ గత ఏడాదికంటే ఎక్కువగా వసూళ్లు చేసేందుకు జోనల్, డిప్యూటి కమిషనర్లు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఖైర‌తాబాద్ జోన్ లో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా మేయ‌ర్ మాట్లాడుతూ… ఖైరతాబాద్ జోన్ లో మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ సర్కిల్ అధికారులు, ఇంజనీర్లు రోడ్లపై ఉన్న గుంతలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించేందుకు మోటర్ సైకిళ్లపై ప్రయాణించి సిటీజన్స్ సమస్యలను తెలుసుకోవాలన్నారు.

ఎస్ఎన్డీపీ వర్క్స్ పై సమీక్షిస్తూ నాలా విస్తరణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తేవాలన్నారు. శానిటేషన్ పై సమీక్షిస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది ఈవెంట్ కాదని, సంవత్సరం పాటు ప్రతిరోజు 24 గంటలు ప్రజలకు సమస్యలు తలెత్తకుండా నిరంతరాయంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్లపై రాత్రిపూట నడిచే స్వీపింగ్ మిషన్ల పనిని స్వయంగా పర్యవేక్షించాలని ఏఎంఓహెచ్ లేదా డిప్యూటీ కమిషనర్లు ఏవిధంగా పనిచేస్తున్నాయో లాగ్ బుక్ ఆధారంగా చెక్ చేయాలని తెలిపారు. పబ్లిక్ టాయిలెట్లు పనిచేస్తున్నాయోలేదో చెక్ చేసి డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో పనిచేసేటట్లు చూడాలన్నారు. వీధి కుక్కల ఫిర్యాదులను వెటర్నరీ శాఖ సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. యూసీడీ అధికారులు వెండింగ్ జోన్లను నిర్దేశించామన్నారు. నైట్ షెల్టర్ల పనితీరుపై నిరంతరాయంగా సమీక్షించాలన్నారు.

ఇంజనీరింగ్ అధికారులు, మెడికల్ ఆఫీసర్లు డివిజన్ లోని ప్రతి వార్డులో రోడ్లు, శానిటేషన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎటువంటి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వార్డు వారిగా శానిటేషన్, డస్ట్ బిన్, స్వచ్ఛ ఆటో, రోడ్ల సమస్యలపై ఎటువంటి ఫిర్యాదులు అందినా పరిష్కరించాలన్నారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ నగరవ్యాప్తంగా 100 శాతం ఇచ్చేందుకు డిప్యూటి కమిషనర్లు, మెడికల్ అధికారులు మొబైల్ వ్యాక్సినేషన్ ద్వారా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యాక్సినేషన్ లో కొత్తగా నమోదవుతున్న 18 సంవత్సరాలు పైబడిన వారికి, రెండో వ్యాక్సిన్ తీసుకోని వారికి 84 రోజుల వ్యవధిలో తప్పకుండా వ్యాక్సినేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని జోన్లలో జనవరి 3వ తేదీ నుండి ప్రతి శుక్రవారం గ్రీన్ డే గా జరుపాలని మేయర్ సూచించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, ఎస్.ఇ.రత్నాకర్, సిటీ ప్లానర్ ప్రదీప్, డిప్యూటి కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ ఇఇ లు, డి.పి.ఓ, యు.బి.డి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement