లక్ష్యాలను చేరుకునేందుకు కలిసి కట్టుగా శ్రమించాలి
సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం
ఆర్జీ- 2 ఏరియా ఓసిపి- 3లో సీఎండీ పర్యటన
యైటింక్లయిన్‌కాలనీ, ఏప్రిల్ 24 (ప్రభన్యూస్): రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించే దిశగా అధికారులు, ఉద్యోగులు కృషి చేయాలని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం పేర్కొన్నారు. ఆర్జీ- 2 ఏరియా ఓసీపీ- 3ని బుధవారం సీఎండీ బలరాం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆర్జీ- 2 ఓసీపీ- 3లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఓసీపీ- 3లో గుత్తేదారు పనులు నిర్వహిస్తున్న ఆర్వీఆర్ కంపెనీ వర్క్ షాప్‌ను సందర్శించి, బొగ్గు అవసరాల దృష్ట్యా గుత్తేదారుకు కేటాయించిన ఓవర్ బర్ధన్ తొలగింపు పనులు వేగవంతం చేయాలన్నారు. అందుకు తగిన విధంగా వాహనాలను, యంత్రాలను అందుబాటులో ఉంచుకొని పూర్తి పని గంటలు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలన్నారు. అనంతరం వారు కోల్ బెంచ్‌లో బొగ్గు ఉత్పత్తిని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.
ఓసీపీ- 3 కృషి భవన్‌లో షావేల్స్, డ్రిల్ సెక్షన్, బేస్ వర్క్ షాప్‌లో కలియ తిరిగి, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడి వారి నుండి మెరుగైన బొగ్గు ఉత్పత్తికి సలహాలు, సూచనలు తీసుకున్నారు. సంస్థ స్థితిగతులను, లక్ష్యాలను వివరించి వాటిని చేరుకోవడానికి ఉద్యోగులు కృషి చేయాలన్నారు. అక్కడ నుండి ఓసీపీ- 3 కృషి భవన్‌లో క్యాంటీన్‌ను పరిశీలించి ఉద్యోగులతో కలిసి టిఫిన్ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడి వారికి కావాల్సిన వసతి సదుపాయాలను అడిగి తెలుసుకొని, వెంటనే వాటిని పూర్తి చేసేలా అధికారులను ఆదేశించారు. సీఎండీ వెంట ఏరియా జనరల్ మేనేజర్ ఎల్‌వి సూర్యనారాయణ, ప్రాజెక్ట్ అధికారి ఎస్.మధు సూదన్, ప్రాజెక్ట్ ఇంజినీర్ రాజాజీ, డీజీఎం వర్క్ షాప్ ఎర్రన్న, డీజీఎం పర్సనల్, అధికార ప్రతినిధి జి.రాజేంద్ర ప్రసాద్, గని మేనేజర్ డి.రమేశ్, సర్వే అధికారి నర్సింగారావ్, ఏరియా సెక్యూరిటీ- అధికారి షరీఫ్ మహమ్మద్, ఓసీపీ- 3 అధికారులు యూనియన్ నాయకులు ఉన్నారు.