ప్రొద్దుటూరు, జూలై 29 ( ప్రభ న్యూస్) : కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లె సమీపంలో ని తెలుగు గంగ ప్రాజెక్టు అంతర్భాగం మైన సబ్సిడీ రిజర్వాయర్ 1 వద్ద విహారయాత్ర కోసం వెళ్లిన ప్రొద్దుటూరు కు చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. వారికోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతు అయిన వారిలో ప్రొద్దుటూరు పవర్ హౌస్ రోడ్డులో నివాసం ఉన్న ఎస్.కె ముధాపీర్ (22), మౌలానా ఆజాద్ వీధికి చెందిన పఠాన్ రహ్మతుల్లా (23), సుందరాచార్ల వీధికి చెందిన వేంపల్లె షాహిద్ (23) ఉన్నారు.
ఆదివారం సెలవు దినం కావడంతో ఈ ముగ్గురు యువకులు మధ్యాహ్నం ఈత కోసం వెళ్లినట్లు సమాచారం. అయితే వీరు రాత్రి ఇంటికి రాకపోవడంతో ఇతర స్నేహితుల్ని వారి తల్లితండ్రులు ఆరా తీశారు. వారు ఇచ్చిన సమాచారంతో చల్లబసాయపల్లె సమీపంలో ని తెలుగు గంగ ప్రాజెక్టు అంతర్భాగం మైన సబ్సిడీ రిజర్వాయర్ 1 వద్దకు తెలుసుకొని దువ్వూరు పోలీసులను యువకుల కుటుంబ సభ్యులు ఆశ్రయించారు.
సోమవారం ఉదయం చల్లబసాయపల్లె రిజర్వాయర్ వద్దకు వెళ్లిన పోలీసులు.. రిజర్వాయర్ గట్టున ఉన్న సెల్ ఫోన్లు, బట్టల ఆధారంగా యువకులు నీళ్ళలో గల్లంతు అయినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాలను నీటిలో దింపి గాలింపు చేపట్టారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించేందుకు దువ్వూరు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రిజర్వాయర్ వద్దకు చేరుకున్న యువకుల స్నేహితులు, బంధువులు చేరుకున్నారు. నదిలో దిగేముందు చివరి సారిగా సెల్ఫీ తీసుకున్న యువకుల ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.