Monday, November 25, 2024

పోరాటంతోనే సమస్యలు పరిష్కారం… భట్టి విక్ర‌మార్క‌

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : పోరాడితే పోయేది ఏమి లేదు.. బానిస సంకెళ్లు తప్ప అని మహాకవి అన్నట్లుగా పొరాటంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర 48వ రోజుకు చేరుకుంది. యాద‌గిరిగుట్ట‌లో శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామిని కుటుంబ సభ్యులతో ద‌ర్శ‌నం చేసుకున్న అనంత‌రం పాద‌యాత్ర‌ కొనసాగించారు. ఈ నేపథ్యంలో గ‌త 405 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆటో డ్రైవ‌ర్లను కలసి సమస్యలను తెలుసుకున్నారు. యాద‌గిరి గుట్ట ఆల‌యాన్ని ప్రారంభించిన మ‌రుస‌టి రోజు నుంచి కొండ‌పైకి ఆటోల రాక‌పోక‌ల‌ను నిషేధించిందని వాపోయారు.

దీంతో త‌మ బ‌తుకులు రోడ్డున ప‌డ్డాయ‌ని వారు ఆవేద‌న‌గా చెప్పారు. ఆటోల‌ను కొండ‌పైకి అనుమ‌తించేలా చేయాల‌ని ఆటో డ్రైవ‌ర్లు భట్టిని వేడుకున్నారు. ఈ స‌మ‌స్య‌పై పోరాటం చేస్తామ‌ని చెప్పారు. ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోయినా.. వ‌చ్చే ఆరునెల‌ల త‌రువాత కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్ప‌డే ఇందిర‌మ్మ రాజ్యంలో ప‌రిష్క‌రిస్తామ‌ని, మీ ఆటోల‌ను తిరిగి కొండ‌పైకి అనుమ‌తిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్, బండ్రు శోభారాణి, బీర్ల ఐలయ్య, శ్రీశైలం, బుడిగే పెంటయ్య గౌడ్, ఇంజ నరేష్, బల్ల యాదేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement