వరంగల్ జిల్లాలో విషాధం నెలకొంది. ఇంటర్ పాసయ్యామన్న ఆనందం కొద్దిక్షణాల్లోనే ఆవిరైంది. బైక్ను ప్రైవేటు బస్సు ఢీకొనడంతో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
వరంగల్ జిల్లా వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బైక్ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంలో మరణించిన నలుగురు ఇంటర్ విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్, ఇల్లంద గ్రామానికి చెందిన మల్లేపాక సిద్ధు, వరుణ్ తేజ్, పొన్నాల రనిల్ కుమార్లు ఒకే బైక్పై ఇల్లంద నుంచి వర్ధన్నపేట వైపు వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరిలో గణేశ్ ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులతో పాస్ కాగా.. మిగతా ముగ్గురితో కలిసి పార్టీ చేసుకున్నాడు. అలా ఒకే బైక్ పై నలుగురు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలం వద్ద మలుపు ఉండటం.. రెండు వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.