Thursday, November 21, 2024

స్టార్టప్‌లకు ప్రాధాన్యం.. బయో ఏసియా లైఫ్‌సైన్సెస్‌ సదస్సు-2023లో ఉచిత స్టాళ్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వచ్చే ఏడాది హైదరాబాద్‌లో జరగనున్న బయో ఏసియా సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర పరిశ్రమల శాఖ ముమ్మరం చేసింది. ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌ స్థాయిని మరింత సుస్థిరం చేసేందుకు ఈ సదస్సును గొప్ప అవకాశంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈసారి సదస్సులో పార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగాల నుంచి ఎక్కువగా స్టార్టప్‌ కంపెనీలు పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సదస్సులో ఉచిత స్టాల్స్‌ ఏర్పాటు చేసుకుని తమ ఉత్పత్తులు ప్రదర్శించుకునేందుకుగాను స్టార్టప్‌ కంపెనీలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇందుకుగాను స్టార్టప్‌ కంపెనీలు స్పేస్‌ రిజిస్టర్‌ చేసుకోవాలని కోరింది. ఇందుకోసం స్టార్టప్‌ కంపెనీలకుఈ నెలాఖరు వరకు గడువిచ్చారు. ఈలోగా స్టార్టప్‌లు ఉచిత స్టాల్‌ల కోసం నమోదు చేసుకోకపోతే తర్వాత రుసుములు చెల్లించి స్పేస్‌ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్‌లో భాగంగా ఇప్పటికే పలు స్టార్టప్‌ కంపెనీలు నమోదు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

లైఫ్‌సైన్సెస్‌ స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా ఇంక్యుబేటర్‌..

లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా రంగాల్లో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకుగాను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బయోటెక్‌ హబ్‌ పేరుతో ఒక ప్రత్యేక ఇంక్యుబేటర్‌ను అభివృద్ధి చేస్తోంది. లైఫ్‌సైన్సెస్‌ కంపెనీల హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో ప్రభుత్వం ఈ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక్కడ కేవలం ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగాలకు చెందిన స్టార్టప్‌లను మాత్రమే కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతించనున్నారు. ఇటీవలే ఇంక్యుబేటర్‌ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఇక్కడి నుంచి పనిచేయనున్న స్టార్టప్‌లకు అవసరమైన మౌళిక సదుపాయాలను కల్పించడంతో పాటు పెట్టుబడిదారుల నుంచి మూలధనం సేకరించే విషయంలోనూ సహకరించనుంది. రానున్న రోజుల్లో హైదరాబాద్‌ ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగాన్ని రానున్న పదేళ్లలో 100 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లేందుకుగాను స్టార్టప్‌లను ప్రోత్సహించి కొత్త ఆవిష్కరణలకు వాణిజ్య గుర్తింపు తీసుకురావడమే మార్గమని బలంగా విశ్వసిస్తున్నట్లు పరిశ్రమ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

లైఫ్‌సైన్సెస్‌, పార్మా రంగాల నుంచి వేలాది మందికి ఆహ్వానం…

ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి వరుసగా నిర్వహిస్తున్న బయో ఏసియా సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల స్టేక్‌హోల్డర్లు హాజరవనున్నారు. వీరిలో ప్రముఖ కంపెనీల యాజమాన్య ప్రతినిధులతో పాటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, శిక్షకులు, విదేశాలకు చెందిన ప్రభుత్వాల్లో పనిచేసే మంత్రులు, అధికారులు తదితరులు సదస్సుకు రానున్నారు. వీరంతా ఇక్కడి స్టార్టప్‌లు తయారుచేసిన ఆవిష్కరణలను, ఉత్పత్తులను పరిశీలించనున్నారు. స్టార్టప్‌లు తయారుచేసే ఉత్పత్తులకు ఆకర్షితులైతే అంకుర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement